హ్యుందాయ్ భారీ ఐపీవో
2.5 బిలియన్ డాలర్ల సమీకరణ లక్ష్యం
న్యూఢిల్లీ, మే 24: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తన సబ్సిడరీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌ను భారతీయ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో భారీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీ కోసం కొటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్‌స్టాన్లీలను అడ్వయిజర్లుగా ఖరారు చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియాలో విక్రయించే వాటా శాతం, తుది విలువల ఆధారంగా ఐపీవో ద్వారా 2.5 బిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్ల వరకూ సమీకరించాలన్నది లక్ష్యమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ భారత్‌లో ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) జారీచేసిందే అతిపెద్ద ఐపీవో . 2022 మే నెలలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ ద్వారా 2.7 బిలియన్ డాలర్లు సమీకరించింది. హ్యుందాయ్ మోటార్ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి జూన్ నెలాకరు లేదా జూలై ప్రధమార్థంలో సమర్పిస్తారని సంబంధిత వ్యక్తులు తెలిపారు. హ్యుందాయ్ ఇండియా సబ్సిడరీ విలువ 20 బిలియన్ డాలర్లు ఉంటుందని ప్రాధమిక అంచనాగా చెప్పారు.






