24 March, 2026 | 10:04 AM

రెండేళ్లయినా హామీల అమలేదీ?

24-03-2026 01:36 AM
  1. రైతు భరోసా కోతలు కోశాక ఇస్తారా? 
  2. ఎక్సైజ్ ఆదాయం పెంచుకుని, తాగుబోతుల రాష్ట్రంగా మార్చుతారా!
  3. అసెంబ్లీలో సర్కార్‌పై విరుచుకుపడిన హరీశ్‌రావు 

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి ): కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్లు దాటినా హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఒక్క సీజన్ కూడా రైతు బంధు ఎగ్గొట్టకుండా ఇచ్చిందన్నారు.

‘ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న ఈ ప్రభుత్వం ఎన్నికల అజెండాలో, తొలి బడ్జెట్‌లో ప్రకటించినప్పటికీ దానిని రూ.12 వేలకు తగ్గించింది. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన నగదును, పంట కోతల సమయంలో ఇస్తూ రైతులను పాలకులు ఇబ్బంది పెడుతున్నారు. గతంలో హామీలో ఇచ్చిన రూ.500 బోనస్‌ను ఈ యాసంగి సీజన్‌కైనా ఇస్తారా? ఇవ్వరా? రైతులకు ప్రభుత్వం రూ.19,000 కోట్లు బకాయిపడింది.

రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని, రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ, ఒక్కసారి కూడా ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రారంభిస్తామని గత బడ్జెట్‌లో  చెప్నినా.. ఈ బడ్జెట్‌లో ఆ సారి ఆ ప్రస్తావనే లేదు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో భారీ స్కాం జరిగింది. 75 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన అంచనా వ్యయం కంటే 4.9 శాతం అధిక మొత్తానికి టెండర్లు కట్టబెట్టారు.

ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.1,000 కోట్ల మేర అవినీతి జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో అవినీతిపై సిట్ వేయాలి ’ అని డిమాండ్ చేశారు. 2014- రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,177 కోట్లు ఆదాయం వచ్చిందని, కేసీఆర్ విజన్, పటిష్టమైన విధానాల వల్ల ఆ ఆదాయం 2023 -24 నాటికి ఏకంగా రూ.14,296 కోట్లకు చేరిందని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే 2015- 16లో 42.5 శాతంతో అద్భుతమైన వృద్ధి రేటు నమోదు చేశామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 2024- 25లో రిజిస్ట్రేషన్ల ఆదాయం రికార్డు స్థాయిలో పాతాళానికి పడిపోయిందని ఆరోపించారు. ఏకంగా మైనస్ 42 శాతానికి పడిపోయి.. ఆదాయం కేవలం రూ.8,473 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ఎక్సైజ్, వ్యాట్ రాబడి రూ.46,941 కోట్లు పెట్టుకున్నారని, 2024 -25 యాక్చువల్స్ రూ. 34,603 కోట్లు ఉంటే సుమారు రూ.12,338 కోట్లు ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. మరో 25వేల కోట్లు అదనంగా లిక్కర్ సేల్స్ పెరుగుతే తప్ప సాధ్యం కాదని,  తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.