24 August, 2026 | 12:42 PM

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి

22-05-2026 07:19 PM

రెండు కుటుంబాలలో అలుముకున్న విషాద ఛాయలు

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల లో  తీవ్ర విషాదం నెలకొంది, సరదాగా ఈత  ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఆ యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తో స్థానికంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఐదుగురు ఇంటర్మీడి యట్ విద్యార్థులు ఈత కొట్టేందుకు మిడ్ మానేరులోకి వెళ్లారు. వీరిలో ఇద్దరు ఈత రాక నీటిలో మునిగి చనిపోయారు.

మృతులు సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన హరిచరణ్ గౌడ్(18), చిర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన మణికంఠ (17)గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం... మణికంఠకు ఈత రాదు. అతడు నీటిలో కొట్టుకుపోతుండగా స్నేహితుడైన హరిచరణ్ గౌడ్‌ను పట్టుకున్నాడు.స్నేహితుడిని రక్షించేందుకు హరిచరణ్ తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు ఇద్దరూ కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు యువకులు సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి  చేరుకుని.. ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తర లించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.