8 August, 2026 | 6:49 PM

ఎరువుల బుకింగ్‌లో ఇబ్బందులుంటే వ్యవసాయ శాఖను సంప్రదించాలి

08-08-2026 04:16 PM

FFS యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ విధానం పరిశీలన

జిల్లా వ్యవసాయ అధికారి కే. మల్లయ్య

గజ్వేల్, ఆగస్టు 8: రైతులకు ఎరువుల బుకింగ్‌ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్స్‌ (FFS) యాప్‌ ద్వారా ఎరువుల బుకింగ్‌ విధానాన్ని సిద్ధిపేట జిల్లా వ్యవసాయ అధికారి కే. మల్లయ్య పరిశీలించారు. గజ్వేల్‌ పట్టణంలోని శ్రీ శ్రీనివాస ట్రేడర్స్‌, షణ్ముఖ ట్రేడర్స్‌, శ్రీ శారద ట్రేడర్స్‌, తెలంగాణ అగ్రోస్‌ తదితర ఫెర్టిలైజర్‌ డీలర్‌ షాపుల్లో బుకింగ్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ యూరియా, డీఏపీ, ఎంఓపీతో పాటు వివిధ పంటలకు వినియోగించే కాంప్లెక్స్‌ ఎరువుల బుకింగ్‌లో రైతులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. అలాగే డీలర్లు, కంపెనీ ప్రతినిధుల సహాయం తీసుకుని ఎరువుల బుకింగ్‌ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.