31 July, 2026 | 12:52 AM

రైతులకు యువత మద్దతు

31-07-2026 12:00 AM

భారతదేశ గతిని మలుపుతిప్పిన చరిత్ర రైతు ఉద్యమాలకు ఉన్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులు సుదీర్ఘకాలం సాగించిన ఉద్యమం దేశవ్యాప్తంగా విశేష ప్రభావం చూపింది.

లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కాగా, అమెరికా మధ్య ప్రతిపాదన దశలో ఉన్న వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ వేదికగా మళ్లీ నిరసనలకు దిగారు.

అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందం జరిగితే దేశంలోని చిన్న, సన్నకారు రైతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఉద్యమం మరోసారి దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారుతున్న తరుణంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి అశుతోష్ రంకా రైతు నేత రాకేశ్ టికాయత్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అన్నదాతల సమస్యలపై జెన్ జీ యువత దృష్టిసారించిన ఈ భేటీ సరికొత్త సంకేతాలను ఇస్తున్నది.

ఇప్పటివరకు విద్యావ్యవస్థలో లోపాలు, పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, నిరుద్యోగం వంటి సమస్యలపై పోరాడిన యువత రైతు సమస్యలపైనా స్పందించడం సాధారణ పరిణామమేమీ కాదు. ఇది ఉద్యమ విస్తరణకు సూచిక అని చెప్పక తప్పదు. రైతులకు యువత అండగా నిలిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. దేశ జనాభాలో అత్యధికులు యువతే. కోట్లాది కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం.

గతంలో రైతు ఉద్యమానికి ప్రధానంగా వ్యవసాయ వర్గాలే నాయకత్వం వహించగా, ఇప్పుడు యువత చురుకైన పాత్ర పోషిస్తే ఉద్యమ స్వరూపం మరింత విస్తృతంగా మారవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా దేశ ప్రజలను చైతన్యపరిచే సామర్థ్యం యువతకు ఉందని నీట్ పేపర్ లీక్‌పై జరిగిన ఉద్యమం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతులు, యువత ఒకే వేదికపైకి వస్తే, అది కర్షకుల సమస్యగానే కాకుండా దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాలపై పెద్ద చర్చకు దారితీస్తుంది. యువతతో పాటు కార్మికులు, ఉద్యోగులు, మేధావులు అన్నదాతలకు బాసటగా నిలుస్తారు. దానివల్ల పాలకులపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అయితే, విభిన్న ధ్రువాల ఈ కలయిక దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా, లేదా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.