అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి
మంత్రి తుమ్మల
ఖమ్మం, జూలై - 27(విజయక్రాంతి):నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పురోగతి వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖమ్మం నగరంలో వరద గండం లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఖానాపురం చెరువు అలుగు వరద పోటెత్తగా అనేక డివిజన్లు ముంపుకు గురయ్యాయని మంత్రి అన్నారు. వర్షాల వరద నీటిని తరలించేందుకు వంద కోట్ల తో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఖమ్మం నగరానికి తాగు నీటి ఎద్దడి లేకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు మంత్రి అన్నారు.
కృష్ణా నది నీళ్లు సరఫరా కానీ పక్షంలో గోదావరి నీళ్లతో పరిష్కారం చేయనున్నామన్నారు. గోదావరి జలాలు మున్నేరు వరకు తరలించామని తెలిపారు. ఖమ్మం నగరంలో వరద ముంపు తాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. 200 కోట్లతో అమృత్ పథకం పనులు సాగుతున్నాయన్నారు. ఆటోమేషన్ విధానంలో అమృత్ పథకం ద్వారా రక్షిత తాగునీరు సరఫరా చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఖమ్మం నగరంలో తాగు నీటి పథకం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర పాలక సంస్థ పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రంజిత్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






