ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
సదాశివనగర్,(విజయక్రాంతి): రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయాన్ని చేస్తే అధిక లాభాలు ఆశించవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పజా పాలనా ప్రగతి ప్రణళిక కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటలలో నానో యూరియాను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు.
ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి,మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రజాప్రతి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు




