గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం
- కాంగ్రెస్ అభ్యర్థులకు గజ్వేల్ ప్రజలు అండగా నిలిచారు
- బిఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా ఖర్చు పెట్టలేకపోయాం
- గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ కు కోటి వేతనం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
- గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి
గజ్వేల్: గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని ఫలితాలు సాధించినట్లు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో పలువురు కాంగ్రెస్ పార్టీలో చిరగా వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ స్వల్ప తేడాలతో మున్సిపల్ పీఠాన్ని కోల్పోగా, బిఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా ఆర్థిక వనరులు సమకూర్చలేకపోయినట్లు చెప్పారు.
కష్టపడిన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చామని, ఓడిన అభ్యర్థులకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. గజ్వేల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకాన్ని అమలు చేస్తుంది.
మరో 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకాలేదన్నారు. ఇప్పటి వరకు రూ కోటికి పైగా వేతనం, ఇతర అలవెన్సులు పొందిన కేసీఆర్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడిన బిఆర్ఎస్ పార్టీ నేతలు జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు షరీఫ్, నేతలు సారిక శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




