18 April, 2026 | 3:28 AM

హాస్పిటల్స్‌కు నిరంతర విద్యుత్..

05-06-2025 01:28 AM
  1. వైద్య సేవలకు అంతరాయం కలగొద్దు
  2. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం: మంత్రి దామోదర

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ఇటీవల జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానలో కరెంట్ లేక టార్చ్‌లైట్ వెలుతురులో వైద్యం అందించిన తరహా ఘటనలు మరోచోట చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతర విద్యుత్ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

ప్రస్తుతం ఉన్న జనరేటర్ల పనితీరును సమీక్షించి వాటిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. జనరేటర్లు లేని చోట ఆటోమేటిక్ జనరేటర్లను సమకూర్చుకునాలన్నారు. విద్యుత్ సరఫరా కోసం అవసరమైన అత్యవసర పరికరాలను, సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధుల నివారణ కోసం అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని టీజీఎంస్‌ఐడీసీ అధికారులను ఆదేశించారు. హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ, ఎన్పీసీడీఎల్ ఎండీ వరుణ్‌రెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్రా రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డి ఉన్నారు.