06-08-2025 09:40:02 AM
కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైంది: బండి సంజయ్
హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింల రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. బీసీల ముసుగులో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లు ఇచ్చే కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని బండి సంజయ్(Bandi Sanjay Kumar) ఎద్దేవా చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తేనే మద్దతిస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా బీసీని ప్రధానిగా చేశారా?, ఉమ్మడి ఏపీలో 48 ఏళ్ల పాలనలో ఒక్క బీసీనైనా ముఖ్యమంత్రి చేశారా?, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులను బీసీలకు ఎన్ని ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు.
కేంద్రంపై నెపం మోపి తప్పుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద బుధవారం కాంగ్రెస్ మహాధర్నా చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కోరుతూ ధర్నాకు దిగనుంది. ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, పలువురు నేతలు పాల్గొనున్నారు. ఉదయం 11 గంటలకు ధర్నాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించనున్నారు. ధర్నాలో సాయంత్రం 4 గంటలకు అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.