06-08-2025 11:22:12 AM
హైదరాబాద్: మొట్ట మొదటి మహిళా హోంమంత్రి, సీనియర్ శాసన సభ్యురాలు అయిన సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాజీ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ మహిళా ఎమ్మెల్యేల పట్ల ఇంత కర్కశంగా, అవమానకరంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడమే సబితా ఇంద్రారెడ్డి చేసిన తప్పా? మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీలుగా బెదిరింపులకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు వారితో కలిసి మహిళా ఎమ్మెల్యే పై దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గమని హరీశ్ రావు మండిపడ్డారు. సబితపై అనుచితంగా, అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలిని, హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు, రౌడీ మూకల దాడులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం.. ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని హరీశ్ రావు హెచ్చరించారు.
మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ(Ration cards) కార్యక్రమంలో ప్రోటోకాల్ పంచాయితీ జరిగింది. బాలాపూర్‌లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి వేదిక మీద కూర్చున్నారు. ఇదేం పద్దతి అని అడగగా మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సబితా ఇంద్రారెడ్డి మీదకు కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. సబితా ఇంద్రారెడ్డికి మహిళా పోలీసులతో రక్షణ ఇవ్వకుండా పోలీసులు చోద్యం చూసినట్లు ఆరోపణలున్నాయి. ప్రోటోకాల్ ఉల్లంఘించిన విషయంలో మంత్రి శ్రీధర్ బాబుపై(Minister Sridhar Babu) సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వస్తున్నాయని వాళ్లిచ్చే రేషన్ కార్డులకు ఇంత డబ్బా కొట్టుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజాపాలన అంటే పోలీసులను పెట్టుకొని కార్యక్రమాలు చేయడమా?, రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ తరపున ఇస్తున్నారా లేక ప్రభుత్వం తరపున ఇస్తున్నారా?, ఏదో గాంధీ భవన్ లో నిర్వహించే రాజకీయ కార్యక్రమం లాగా అర్హత లేని వ్యక్తులను స్టేజీపైన ఎలా కూర్చోబెడతారు? అని ప్రశ్నించారు. కేవలం లబ్ధిదారులకు నష్టం జరగొద్దనే మౌనంగా బయటికి వచ్చానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.