మాకు ఎవరి మద్దతు అవసరం లేదు.. ప్రజల మద్దతు చాలు
హైదరాబాద్: బీఆర్ఎస్ గంగలో కలిసిన పార్టీ అని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకున్నా ప్రయోజనం లేదన్నారు. అవినీతి, కుటుంబ పార్టీలకు బీజేపీ దూరంగా ఉంటుందని, కేసీఆర్, కేటీఆర్ ను ప్రజలు చీదరించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం అవుతుందని, అందుకోసమే ముందస్తుగా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని సంజయ్ ఆరోపించారు.
కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ తోనే మొదలైందన్నారు. మాకు ఎవరి మద్దతు అవసరం లేదు.. ప్రజల మద్దతు చాలు అని బండి సంజయ్ తెలిపారు. 6 గ్యారెంటీలను పక్కదోవ పట్టించడానికే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తుందోని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు రుణమాఫీపై ఆందోళనలో ఉన్నారని, రైతులకు బ్యాంక్ ల నుంచి ఎన్వోసీలు ఇప్పించాలన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వంతో బీజేపీ కొట్లాడుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు.






