16 June, 2026 | 5:35 PM

'నేను వద్దంటే ఎక్కడా ప్రాజెక్టులు ఆగవు'..! సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి కౌంటర్

16-06-2026 05:03 PM
  1. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిపై మాకెవరూ పాఠాలు చెప్పనక్కర్లేదు
  2. తెలంగాణ అభివృద్ధి కోసం 12 ఏళ్లుగా పనిచేసాం.. ఇప్పుడూ పనిచేస్తాం
  3. రేవంత్ రెడ్డికి జవాబుదారీ కాదు.. తెలంగాణ ప్రజలకు జవాబుదారీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నిన్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై(Union Minister Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రోను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మెట్రోపై రేవంత్, కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి(Kishan Reddy) మంగళవారం నాడు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో మెట్రో ఫేజ్ -1కు(Hyderabad Metro Phase-1) కేంద్ర ప్రభుత్వం రూ. 1,250 కోట్లు ఇచ్చిందని చెప్పారు. దేశవ్యాప్తంగా మిగతా మెట్రోల మాదిరిగానే హైదరాబాద్ మెట్రోకు కేంద్ర సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సాంకేతిక, ఆర్థిక విషయాలు చర్చించి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే సాకారమవుతాయని తెలిపారు. తెలంగాణ కావున, కిషన్ రెడ్డి వద్దంటే ప్రాజెక్టులు ఎక్కడా ఆగవని కౌంటర్ ఇచ్చారు. అనాలోచితంగా, దుందుడుకుగా సీఎం మాట్లాడటం సమంజసం కాదని సూచించారు.

తెలంగాణ అభివృద్ధి పట్ల తనకు చిత్తశుద్ధి ఉందని వెల్లడించారు. మోదీకి, తనకు, కేంద్రానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్టిఫికెట్ అవసరం లేదని హితవు పలికారు. తాము రేవంత్ రెడ్డికి జవాబుదారీ కాదు.. తెలంగాణ ప్రజలకు జవాబుదారీ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం 12 ఏళ్లుగా పనిచేసాం.. ఇప్పుడూ పనిచేస్తామని సూచించారు. తెలంగాణకు ఇచ్చి హామీలు తూచా తప్పకుండా అమలు  చేస్తున్నామని వివరించారు. తెలంగాణ బిడ్డగా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశానని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఢిల్లీకు వచ్చి రెండు సార్లు ధర్నా చేశామని తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాతే ఏపీ భవన్ లో అమరణ దీక్ష విరమించానని పేర్కొన్నారు.

తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి పట్ల తమకెవరూ పాఠాలు చెప్పనక్కర్లేదని హెచ్చరించారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం నాడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేఖలు రాశానని చెప్పారు. రేవంత్ రెడ్డి కోరితే రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు చేపట్టలేదన్న కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టిందని వెల్లడించారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 కోసం కేసీఆర్ సహకరించలేదని ఆరోపించారు. కేసీఆర్ సహకరించకపోయినా ప్రధాని చేతుల మీదుగా ఫేజ్-2 ప్రారంభించామని తెలిపారు. తెలంగాణకు రాదనుకున్న రైల్వే ఫ్యాక్టరీని సాధించామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఏ పార్టీల ప్రభుత్వాలు ఉన్నా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. మోదీ ఇస్తుంటే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారనడం దిగజారుడు రాజకీయాలేనని కొట్టిపారేశారు.  ఎన్డీయే ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు వడ్డీ లేకుండా ఇటీవల సాస్కీ రుణాలను కేంద్రం ఇచ్చిందని తెలిపారు.

మూసీ పునరుజ్జీవం కోసం ఏడీబీ రుణానికి కేంద్రం ఎన్ వోసీ ఇచ్చిందన్నారు. ఎన్ సీడీసీ ద్వారా పదేళ్లుగా తెలంగాణకు రూ. లక్ష కోట్లు మంజూరు అయ్యాయని లెక్క చెప్పారు.  ధాన్యం కొనుగోళ్లకు రూ. 37 వేల కోట్లను ఎన్ సీడీసీ ద్వారా మంజూరు చేశామని తెలిపారు. ఇప్పటివరకు రూ. 34 వేల కోట్లు ఎన్ సీడీసీ తెలంగాణకు అందిందని వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి అనేక మార్పులను రాష్ట్రానికి కేంద్రం సూచించిందని వెల్లడించారు. ప్రాజెక్టులు ఆపే సంస్కృతి బీజేపీకి లేదు.. అది కాంగ్రెస్ కే ఉండొచ్చన్నారు. డొంకదారిన ప్రాజెక్టులు అడ్డుకోవాల్సిన కర్మ తమకు లేదని తెలిపారు.

రేవంత్ రెడ్డి కోసమో, మరెవరి కోసమో ప్రాజెక్టులు అడ్డుకోమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు సహకరిస్తామన్నారు. ఐఆర్ ఎఫ్ సీతో ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13 వేల కోట్లు తీసుకునేందుకు కేంద్రం సహకరించిందన్నారు. రుణ ఒప్పందం విషయమై అధికారులతో ఫోన్ లో మాట్లాడినట్లు చెప్పారు. రుణం విషయమై రాష్ట్ర ప్రభుత్వం, ఐఆర్ఎఫ్ సీ మధ్య ఒప్పందం జరిగిందన్నారు. మెట్రో ఫేజ్ 2 మరింత వేగవంతానికి తాను సీఎంకు లేఖలు రాశానని చెప్పారు.