భవిష్యత్ కోసం ఐక్యంగా..!
- సంస్థ భవిష్యత్ దిశగా ఉద్యోగుల అడుగులు
- ఆర్టీసీ, కార్మికులు కలిసి నడవాల్సిన అవసరం
- సంస్థ తరఫున ఈవీ బస్సుల కొనుగోలుపై దృష్టి పెట్టాలంటున్న మేధావులు, విశ్లేషకులు
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లలో ప్రధానమైనది.. గత ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. అపాయింటెడ్ డేను ప్రకటించడం. దీనివల్ల ఉద్యోగులందరికీ జీతభత్యాలు, ఇతర వసతుల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా లభించనున్నాయి.
ఇది నిజానికి ఎప్పుడో పూర్తి చేయాల్సిన ప్రక్రియ. కానీ గత ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 25 నెలల కాలం గడుస్తున్నా.. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం లేదు. రాజకీయ కారణాలు కావచ్చు.. ఆర్థిక, ఇతర కారణాలు కావచ్చు. కానీ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ఇది పూర్తిగా కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్‌కు సంబంధించిన అంశం. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా అమలుచేస్తే.. తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్ బాగుంటుంది. దీనితోపాటు ఆర్టీసీ భవిష్యత్‌ను చూసే బాధ్యత కూడా ఆర్టీసీ సంఘాలపై ఉంది.
పట్టు పట్టాలి..
నిజాలను సూటిగా మాట్లాడుకుంటే.. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు వేగంగా కసరత్తు మొదలయ్యింది. ఇందులో భాగంగానే.. విడతల వారీగా ఈవీ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నారు. అయితే ఈవీ బస్సులను ప్రవేశపెడితే.. ప్రమాదం లేదు.. పైగా అది స్వాగతించాల్సిన అంశం. అయితే ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు తయారుచేసిన ఈవీ బస్సులను ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇస్తూ.. వాటి నిర్వహణకు సిబ్బందిని కూడా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంటున్నాయి.
అంటే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ఈవీ బస్సుల నిర్వహణలో ప్రమేయం లేకుండా.. అంతా ప్రైవేటు కంపెనీలే చూసుకుంటున్నాయి. ఇందుకు ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపుతూ.. నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే అంశం.. ఇప్పుడు ఆర్టీసీ సంస్థ భవిష్యత్‌కు గొడ్డలివేటులా మారిందని కార్మిక వర్గాలు, మేధావుల్లో చర్చ కొనసాగుతోంది.
సంస్థ తరఫునే కొనుగోలు శ్రేయస్కరం
నిజానికి గతంలో మాదిరిగానే.. ఆర్టీసీయే ఈవీ బస్సులను కూడా కొనుగోలు చేసి.. ఆర్టీసీ సిబ్బందితో నిర్వహిస్తే.. ఆర్టీసీ సంస్థ భవిష్యత్.. ఆరు బస్సులు.. మూడు వర్క్‌షాపులుగా వర్ధిల్లుతుందని మేధావులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్టీసీలో కొత్తగా కార్మికులు, ఉద్యోగులను భర్తీ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని, తద్వారా సంస్థ భవిష్యత్ బాగుపడుతుందని వారు విశ్లేషిస్తున్నారు.
అలా కాకుండా.. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు కంపెనీల నుంచి అద్దెకు తీసుకుంటే.. సంస్థ భవిష్యత్‌ను కాలరాసుకోవడమేనని వారంటున్నా రు. తద్వారా ఇప్పటికే డిపోలు, వాటి స్థలాలపై అజమాయిషీ చేస్తున్న ప్రైవేటు కంపెనీలు.. భవిష్యత్‌లో మెల్లగా విలువైన ఆయా స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లను లీజుకు తీసుకోవడం ద్వారా మొత్తం వ్యవస్థను చేతుల్లోకి తీసుకుంటాయని, ఆపై ప్రభుత్వ పెద్దల నుంచి అంతర్గతంగా వచ్చే మద్దత్తుతో.. ఆర్టీసీ సంస్థ మొత్తం ప్రైవేటీకరణ అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఈవీ బస్సులనూ సాధించుకోవాలి
ఎప్పటిలాగే ఈవీ బస్సులనూ ఆర్టీసీ సంస్థ తరఫున కొనుగోలు చేస్తే.. ఆర్టీసీ సంస్థ భవిష్యత్‌కు ఢోకా ఉండదని మేధావులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలను పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్లతోపాటు.. ఈవీ బస్సులను ఆర్టీసీ సంస్థే కొనుగోలు చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్‌గా ఉండాలని మేధావులు అంటున్నారు.
అలా చేయడం వల్ల కొత్త ఉద్యోగాల కల్పన, ఆర్టీసీ ఆస్తులకు రక్షణ, ప్రజా రవాణా సేవలను మరికొన్ని దశాబ్దాలపాటు చేసే అవకాశం ఉంటుందని వారంటున్నారు. అంటే భవిష్యత్ తరాలకూ ఆర్టీసీలో ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం చిక్కుతుంది. ఇది జరిగితే ఆర్టీసీ భవిష్యత్ కూడా మరో పదికాలాలపాటు భద్రంగా ఉంటుంది. అందుకే ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల గుర్తింపుతోపాటు.. ఆర్టీసీ సంస్థ భవిష్యత్‌తో ముడిపడిన ఈవీ బస్సుల కొనుగోలు అంశాన్ని కూడా సాధించుకోవాలని మేధావులు, విశ్లేషకులు సూచిస్తుండటం గమనార్హం.






