అన్నదాతను ముంచిన అకాల వర్షం
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, మక్కలు
- కాపాడుకునేందుకు రైతుల పాట్లు
- నేలరాలిన మామిడికాయలు పలుచోట్ల నేలవాలిన వృక్షాలు
- గాలివానకు ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పులు
మహబూబాబాద్/సూర్యాపేట/మిర్యాలగూడ/హుస్నాబాద్/కోహెడ/తుంగతుర్తి/ఇల్లందు, మే 3 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వడగళ్లతో పాటు అకాల వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం, మక్కలు తడిసిముద్దవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలుచోట్ల మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది.
బయ్యారం, కురవి, మరిపెడ, కేసముద్రం తదితర మండలాల్లో అకాల వర్షానికి ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు, కేసముద్రం మార్కె ట్లో ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయానికి తెచ్చిన రైతులు పంట ఉత్పత్తులను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ పట్టణంలో గాలివానకు పలు ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరి పోయాయి. మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాం డ్ వద్ద రాకపోకలు స్తంభించాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం, మక్కలు ఆదివారం ఒక్కసారిగా కురిసిన అకాల వడగళ్ల వానకు తడి సి ముద్దయ్యాయి. రైతుల కళ్లముందే వారి శ్రమ నీటిలో కలిసిపోయినట్టైంది. ధాన్యం అడుగుభాగం పూర్తిగా తడిసి నాణ్యత కోల్పోయింది. మొక్కజొన్న గింజలు కూడా పాడయ్యే పరిస్థితి ఏర్పడింది. మార్కెట్ యార్డులో కొనుగోళ్లు సకాలంలో జరగకపోవడం రైతుల ఇబ్బందులను మరింత పెంచింది.
ధాన్యం వెంటనే కొనుగోలు చేసి ఉం టే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ నమో దు విధానం కూడా రైతులకు భారంగా మారింది. మౌలిక సదుపాయాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. వర్షం నుండి రక్షించేందుకు తగిన షెడ్లు లేకపోవడం, కవరింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు తమ పంటను కాపాడుకునే అవకాశాన్ని కోల్పోయారు. తడిసిన ధాన్యా న్ని ప్రత్యేక నిబంధనలతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
కోహెడ మం డలం వెంకటేశ్వర్లపల్లిలో అకాల వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు లు ఆరబోసిన వరి, మక్కలు తడిసి ముద్దయ్యాయి. తూకం వేసిన గన్ని బస్తాలలోని వరిధాన్యం కూడా తడవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సుమారు 20 రోజుల నుంచి విక్రయానికి సిద్ధం చేసిన వరి, మొక్కజొన్న ధాన్యంను కొనుగోలు జాప్యం తో నష్టం జరిగిందని రైతులు ఆందోళన చెందారు.
భద్రాద్రి జిల్లాలో
భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలంలోని రేపల్లెవాడ (చలసముద్రం) మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద అకాల వర్షం కురవడంతో రైతులు తీసుకువచ్చిన మొక్కజొన్న బస్తాలు పూర్తిగా తడిసి వందలాది క్వింటాళ్ల పంటకు నష్టం వాటిల్లింది. సరైన గిడ్డంగులు, షెడ్లు, తార్పులు అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత తీవ్రం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇల్లందు ఇల్లందు పట్టణంలోని 24వ ఏరియా పోచమ్మ గుడి సమీపంలో హఠాత్తుగా వీ చిన ఈదురు గాలుల ప్రభావంతో మామిడి చెట్టు కూలి చేతి సరోజ ఇంటిపై పడటంతో రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదే స మయంలో కురిసిన భారీ వర్షంతో పగిలిన రేకుల గుండా వర్షపు నీరు ఇంట్లోకి చేరి టీ వీ, బీరువా, బట్టలు, వంట సామాన్లు సహా గృహోపకరణాలన్నీ తడిసి ముద్దయింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులు, కురిసిన వాన జన జీవనాన్ని ఆగమాగం చేసింది. మిర్యాలగూడలో పలు విద్యుత్ స్తంభాలు విరిగిపడగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కూరగా యల మార్కెట్ వద్ద వీచిన పెను గాలికి చెట్లు విరిగి దుకాణాలపై పడ్డాయి. ఒకదశలో వీచిన గాలికి ద్విచక్ర వాహనాలు సైతం ఎగిరి పడ్డాయి.
మిర్యాలగూడ మండల పరిధిలోని యాద్గార్ పల్లి, తుంగపాడు, వెంక టాద్రిపాలెం, శ్రీనివాస్ నగర్‌తో పాటు పట్టణంలోని పలు మిల్లులో ఆదివారం సాయం త్రం వీచిన ఈదురు గాలులకు మిల్లులోని ఎలివేటర్లు, గోడౌన్ రేకులు ధ్వంసమయ్యాయి. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నాగారం తిరుమలగిరి, మద్దిరాల, నూతనకల్ మండ లాల్లో గాలిదుమారం, అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
చేతికొచ్చిన మామిడి కాయలు నేలరాలగా.. ఐకెపి కేం ద్రాల్లో ఆరబోసిన ధాన్యం నీటి పాలవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. తుం గతుర్తి మండలంలోని తూర్పుగూడెం రైతు గుండగాని మల్లయ్యకు చెందిన 4 ఎకరాల మామిడి తోటలో కొన్ని చెట్లు పూర్తిగా విరిగిపోగా, కాయలు రాలిపోవడంతో సుమారు రూ.3 లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు తన గోడు వెళ్లబోసుకున్నారు. హుజూ ర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల పా లకవీడు గరిడేపల్లి మండలాల్లో వడగళ్ల వాన కురిసింది.
పిడుగుపాటుకు రైతు మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివా రం సాయంత్రం కురిసిన గాలివాన బీభ త్సం సృష్టించింది. మహబూబాబాద్ జిల్లా సూదనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడుస్తున్న ధాన ్యంపై టార్పాలిన్ కప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పిడుగు పడి నీల వెంకన్న (45) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై బత్యం సమ్మ య్య అనే రైతుకు చెందిన మూడు ఎడ్లు మృతి చెందాయి.
వడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వడ్లను విక్రయించుకునేందుకు పది రోజుల క్రితం తెచ్చాను. వారం రోజుల నుంచి లోడింగ్, అన్‌లోడింగ్ సమస్యతో పాటు గన్నీ సంచులు కూడా ఇవ్వకపోవడంతో జాప్యం జరిగింది. కురిసిన వర్షానికి వడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం కరుణించి నష్టపరిహారం ఇవ్వాలి, తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనాలి.
వున్న అశోక్ (హుస్నాబాద్, రైతు)
తడిసిన ధాన్యం కొనాలి
మేము పండించిన వడ్లను హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఐదు రోజుల క్రితం తీసుకువచ్చాము. పూర్తిగా వడ్లను ఆరబోశాం. అకాల వర్షానికి పూర్తిగా వడ్లు నాని ముద్దాయ్యాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలి.
గూళ్ల శారద (హుస్నాబాద్, రైతు)






