17 May, 2026 | 1:06 AM

అకాల వర్షం.. అపార నష్టం

17-05-2026 12:00 AM
  1. ఉమ్మడి పాలమూరులో దంచికొట్టిన వాన
  2. కొనుగోలు కేంద్రాల్లో రైతన్నల అవస్థలు
  3. గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో పిడుగుపాటుకు ఒకరి మృతి
  4. ఈదురు గాలులకు నేలకొరిగిన వృక్షాలు

వనపర్తి/నాగర్‌కర్నూల్/కొల్లాపూర్ టౌన్/అలంపూర్, మే 16 (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో పిడుగుపాటుకు ఒకరి మృతిచెందారు. ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వర్షపు నీటిలో తడిసింది.

ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ, నిత్యం అధికారులకు అకాల వర్షాలు కురిస్తే తగు జాగ్రత్త లు తీసుకోవాలని ఎప్పటికప్పుడు కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కేంద్రాల్లో సరైన వసతులు కల్పించక పోవడంతో రైతన్నలు అవస్థలు పడ్డారు.

తడిసిన ధాన్యాన్ని అధికారులు తేమ పేరుతో తిరస్కరిస్తారేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల వాహనాలు, దుకాణ డబ్బాలపై పడ్డాయి. విద్యుత్ శాఖ అధికారులు తక్షణ చర్యలు చెప్పట్టి విద్యుత్ అంతరాయం లేకుండా చేశారు.

కొల్లాపూర్‌లో గాలివాన బీభత్సం

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో సాయంత్రం కురిసిన ఈ వర్షానికి ప్రధాన రోడ్ల వెంట అరబెట్టుకున్న మొక్కజొన్న పంట పూర్తిగా వర్షపానీటిలో కొట్టుకుపోయింది.

వ్యవసాయ మార్కెట్ లో కొనుగోలు కోసం తీసుకొచ్చిన ధాన్యాన్ని హమాలీలు, గన్ని బ్యాగులు, లారీలో కొరత సాకుగా చూపి అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని వర్షం నుండి కాపాడేందుకు టార్పాలిన్లు కప్పుకొని భద్రపరుచుకున్నారు. ధాన్యం వర్షపు నీటిలోనే ధాన్యాన్ని కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు.

నెలల తరబడి కళ్లాల్లోనే కాపు కాసి ఉన్నా ప్రభుత్వం కనికరించడం లేదని ధాన్యం సకాలంలో కొనకపోవడంతో ఇల్లు వాకిలి వదిలి ఇతర వ్యవసాయ పనులను కూడా వదిలి మార్కెట్లోనే పడిగాపులు కావాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పిడుగుపాటుకు ఎన్మన్ బెట్ల గ్రామంలో 30గొర్రెలు మృతి చెందాయి.

పిడుగుపాటుకు కొడుకు మృతి, తండ్రికి గాయాలు

గద్వాల జిల్లా తుప్పత్రాలకు చెందిన వడ్డే శ్రీనివాసులు (45) అతని కుమారుడు నాగేష్ (25) తో కలిసి అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తమ వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటు న్నారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైం ది. ఈ క్రమంలో పిడుగు పడటంతో నాగే ష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి శ్రీనివాసులుకి స్వల్ప గాయాలయ్యాయి.