ఎన్నాళ్లీ కన్నీటి కష్టాలు?
అకాల వర్షాలు తెలంగాణ అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. మొన్నటి దాకా భానుడి ప్రకోపానికి తల్లడిల్లిన గ్రామీణ రైతాంగం రెండు రోజుల క్రితం ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టితో దారుణంగా దెబ్బతిన్నది. ప్రాణనష్టంతోపాటు భారీగా పంటనష్టం సంభవిం చింది. కోతకు వచ్చిన పంట వడగళ్లు, భీకర వర్షం దెబ్బకు పంట నేలకొరిగి ఆరుగాలం కష్టించిన రైతును కోలుకోని దెబ్బతీసింది. కోసిన పంట సైతం మార్కెట్లో సకాలంలో అమ్ముడుపోక, కళ్లాల్లోనే వానకు తడిసి పోయి కొనే నాథుడే కరువయ్యాడు. అయిన కాడికి అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో రైతన్న ఉన్నాడు. ఇంతకు ముందుకూడా వచ్చిన అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతకు భారీవర్షాలు ‘గోరుచుట్టుపై రోకటిపోటు’ చందంగా తయారైంది. అటు ఆదిలాబాద్ నుంచి ఇటు నల్గొండ జిల్లా దాకా అన్ని జిల్లాల్లోను పరిస్థితి ఇదే విధంగానే ఉంది. యాసంగి పంట చేతికి వచ్చి ధాన్యాన్ని కొనే సమయానికి ఎన్నికల సందడి మొదలవడంతో అధికారులంతా ఎన్నికల హడావిడిలో మునిగిపోయారు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజా సమస్యలు తెరమరుగయ్యాయి.
హఠాత్తుగా భారీ వర్షాలు కురవడం, వేలాది ఎకరాల్లో పంటనష్టం కావడంతో ఇప్పుడు అన్ని పార్టీల దృష్టీ దీనిపైనే కేంద్రీకృతమైంది. ముఖ్యంగా గత పదేళ్లుగా అధికారంలో ఉండి తాజా ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్‌ఎస్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడికి దీన్నో అస్త్రంగా మలుచుకుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొన్నామని, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రభుత్వమే తడిసిన ధాన్యాన్ని కొని రైతులను ఆదుకున్నామంటున్న కేసీఆర్ పార్టీ నేతలు, ఇప్పుడు రేవంత్ సర్కారు అన్నదాతలను గాలికి వదిలేసిందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. బీజేపీ వాళ్లుకూడా ఎన్నికల ప్రచారంలో ఇదే సమస్యపై రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపాటు మంత్రులు ఉత్తమ్, తుమ్మల హామీ ఇచ్చారు.
అయితే, ఈ సమస్య ఈ ఒక్క ఏడాదిది కాదు. ప్రతి ఏడాదీ అకాల వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పార్టీని ఎండ గట్టడం, ప్రభుత్వం తాత్కాలికంగా కంటి తుడుపు చర్యలు చేపట్టడం పరిపాటిగా మారింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందన్న హామీ లేనప్పుడు ఏ రైతు అయినా ఎందుకు చెమటోడ్చి పంట పండిస్తాడు? సరైన ధర లభించేదాకా పంటను దాచుకోవడానికి గోదాములు ఉండవు. ఒకవేళ మార్కెట్ యార్డుల్లో గోదాములున్నా అధికా రులు వాటిని ప్రైవేటు కంపెనీలకు కిరాయికి ఇస్తున్నారు. దీంతో రైతు తాను మార్కెట్‌కు తెచ్చిన ధాన్యాన్ని ఆరు బయటే ఉంచుకోవలసి వస్తోం ది. వర్షం వస్తే ధాన్యమంతా తడిసి ముద్దవుతుంది. దాన్ని కొనేందుకు ఏ వ్యాపారీ ముందుకు రాడు. ఒకవేళ కొన్నా సగం సొమ్మే దక్కుతుంది.
వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే చేతికి వచ్చేది సగం కూడా ఉండదు. ఇది ఒక్క వరి ధాన్యం విషయంలోనే కాదు. మొక్కజొన్నలాంటి ఇతర ఆహార పంటలు, మామిడి లాంటి వాణిజ్యపంటల సమస్య కూడా. ప్రభుత్వాలు ప్రతి ఏటా బడ్జెట్ సమయంలో రైతులకోసం ఎన్నో హామీలు ఇచ్చినా ఆచరణలో అవేవీ నెరవేరడం లేదు. అన్నదాతలు దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యమాలు చేసినా వారి ప్రధాన డిమాండ్ అయిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ఇలాంటి పరిస్థితిలో ఏటా వ్యవసాయం చేసే వారిసంఖ్య తగ్గిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వీరి సమస్యలపై దృష్టి పెట్టకపోతే ఆహార ధాన్యాల విషయంలో స్వయంసమృద్ధి సాధించిన భారత్ మరోసారి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి తలెత్తవచ్చు.






