20 April, 2026 | 5:35 PM

ఆర్టీసీ సమ్మె వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

20-04-2026 03:56 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (Telangana State Road Transport Corporation) కాపాడుకోవడం కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22వ తేదీ మొదటి డ్యూటీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (TGSRTC Joint Action Committee) ప్రకటించింది. సోమవారం ఆసిఫాబాద్ డిపోలో జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఇది కేవలం జీతాల కోసం చేసే సమ్మె కాదని, ప్రజల ఆస్తి అయిన ఆర్టీసీని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవడం కోసం, వేలాది కార్మిక కుటుంబాల భవిష్యత్తు కోసం చేపట్టిన పోరాటమని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించకపోతే 22వ తేదీ నుంచి ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటకు రాదని హెచ్చరించారు. సమ్మె వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ బకాయిలు చెల్లించడం, మహిళల ఉచిత బస్సు పథకం కింద బకాయిలు విడుదల చేయడం, కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, ప్రైవేటీకరణ ఆపడం, యూనియన్ హక్కులను పునరుద్ధరించడం, ఖాళీలను భర్తీ చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.