దైవ అనుగ్రహం సన్మార్గం వైపు నడిపిస్తుంది
ఆంజనేయ స్వామి, గరుత్మంతుడి విగ్రహాల ఆవిష్కరణ
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): దైవ అనుగ్రహం సన్మార్గం వైపు నడిపిస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని సింహగిరి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఆంజనేయ స్వామి, గరుత్మంతుడి సుధామూర్తుల విగ్రహాలను ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహాలకు ఘజమాలలు వేసి భక్తి శ్రద్ధలతో అలంకరించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆయన లక్ష్మీ నృసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు వేద ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవాలయ అభివృద్ధి కోసం ముడా నిధుల కింద రూ.10 లక్షల వ్యయంతో గ్రీనరీ అభివృద్ధి, డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాక సమాజ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యాల కోసం అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు దేవాలయ ప్రాంగణంలో చేపడతామని తెలిపారు.
శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయ క్షేత్రపాలకులైన గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన జరుపుకోవడంతో ఇప్పుడు ఆలయం సంపూర్ణ రూపాన్ని సంతరించుకుందని, ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని క్షేత్ర పాలకుల విగ్రహాలు ఆవిష్కరించే భాగ్యం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆలయం దేదీప్యమానంగా వెలుగుతూ భక్తుల కోరికలు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారు నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారు.
దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, దేవాలయ సుందరీకరణ కమిటీ అధ్యక్షులు పోల శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ కృష్ణయ్య, తిరుపతి నాయక్, ఆలయ కమిటీ సభ్యులు నాయకులు చందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






