తమిళనాడు అసెంబ్లీలో రచ్చరచ్చ

09-09-2026 | 05:20am
  1. ఈఎంఐల రూపంలో లంచాలు.. వ్యాఖ్యలపై గరంగరం
  2. సీఎం విజయ్ ఆరోపణలను రికార్డుల్లోంచి తొలగించాలి
  3. నినదించిన డీఎంకే సభ్యులు.. కుదురదన్న స్పీకర్
  4. పొడియం వద్దకు దూసుకువెళ్లిన సభ్యులు
  5. డీఎంకే ఎమ్మెల్యేలను బయటికి ఎత్తుకెళ్లిన మార్షల్స్

చెన్నై, సెప్టెంబర్ 8: తమిళనాడు(Tamil Nadu)లో గత డీఎంకే ప్రభుత్వంపై అసెంబ్లీ(Assembly) వేదికగా సోమవారం సీఎం విజయ్ చేసిన అవినీతి ఆరోపణలు, విమర్శలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. గత ప్రభుత్వం పాలనలో లంచాలు ఈఎంఐల రూపంలో తీసుకున్నారన్న వ్యాఖ్యలపై సభ అట్టుడికింది. అధికార టీవీకే, ప్రతిపక్షం మధ్య సర్కారియా కమిషన్, మీసా ప్రస్తావనపైనా ఆగ్రహ మంటలు చెలరేగాయి.

సీఎం వ్యాఖ్యల రికార్డులను ఎట్టిపరిస్థితుల్లోనూ సభ నుంచి తొలగించాలని డీఎంకే సభ్యులు మంగళవారం అసెంబ్లీలో తీవ్రనిరసన తెలిపారు. స్పీకర్ సస్సేమిరా అనడంతో తాము కూడా తగ్గేదేలే అంటూ.. పొడియం వద్దకు దూసుకెళ్లారు. ప్రతిపక్షం నిరసనల హోరుతో సభంతా రచ్చరచ్చగా మారడంతో స్పీకర్ మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో డిఎంకే సభ్యులను బలవంతంగా అసెంబ్లీ హాల్ బయటికి తరలించారు.

మిళనాడు అసెంబ్లీలోసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే, డీఎంకే విప్ ఈవీ వేలు సోమవారం నాటి ముఖ్యమంత్రి ప్రకటనను ప్రస్తావిస్తూ, అవినీతికి సంబంధించిన ఈడీ ఆరోపణల వంటి అంశాలపై సీఎం చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎటువంటి నేరాలు రుజువు కాలేదని స్పష్టం చేసిన సర్కారియా కమిషన్ గురించి, మిసా(అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం) గురించి, మారన్ గురించి ప్రస్తావించడంపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్‌పైను తీవ్రంగా విమర్శించారు. తమను తాము సమర్థించుకునే అవకాశం లేని వ్యక్తుల గురించి లేదా మరణించిన వారి గురించి చర్చించడం అనుచితమని ఆయన మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ఈ విషయాన్ని ప్రస్తావించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే’ అని ఆయన ఆగ్రహించారు. వివాదాస్పద వ్యాఖ్యలను, సభ బయట ఉన్న వ్యక్తులపై చేసిన నిరాధారమైన ఆరోపణలను అధికారిక శాసనసభ రికార్డుల నుంచి తొలగించాలని ఆయన స్పీకర్‌ను కోరారు. అధికార పార్టీ సభ్యులు, ప్రతిపక్ష డీఎంకే సభ్యుల వాడివేడి వాదనల జరిగాయి.

అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తొలగించకూడదని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించడంతో, డీఎంకే ఎమ్మెల్యేల నినాదాలు మార్మోగాయి. అనేకమంది డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినదించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అసెంబ్లీ అనేది రాజకీయ వేదిక కాదని గుర్తుచేస్తూ, సభ్యులు తమ స్థానాలకు తిరిగి వెళ్లి సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ కోరారు. అయినా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో గీఎంకే సభ్యులను చివరకు బయటకు పంపాలని స్పీకర్ మార్షల్‌సను ఆదేశించారు. దీంతో వారిని అసెంబ్లీ హాల్ నుంచి మార్షల్స్ బయటికి గెంటేశారు. 

అనంతరం అసెంబ్లీ బయట ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు ఉండాలని, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల నుంచి తప్పించుకోజూస్తున్నారని ఆరోపించారు. ఇటీవల తమిళనాడులో పంచాయతీ కౌన్సిల్ అధ్యక్షుడు మహారాజన్‌పై పాండియన్ అనే వ్యక్తి దాడి చేయగా ఆయన మృతి చెందాడు. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీవీకే ప్రభుత్వం రాష్ట్రంలో అసురక్షిత వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు