ఖాజాగూడలో భూ అక్రమాల కలకలం?
- సర్వే నం. 28లో ప్రభుత్వ భూములపై భారీ అక్రమాలపై ఆరోపణలు
వేల గజాల బదిలీపై సందేహాలు
అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 19(విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖాజాగూడ ప్రాంతంలో భూ అక్రమాల వ్యవహారం పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తోంది. రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 28లో ఉన్న మొత్తం 31.39 ఎకరాల ప్రభుత్వ భూమిలో భాగంగా సుమారు 2,742 చదరపు గజాల భూమిని ఆక్రమించి, తదనంతరం రిజిస్ట్రేషన్లు జరిపినట్లు ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి.
2020 జూన్ ప్రాం తంలోనే నిర్మాణాలు ప్రారంభమై, అనంతరం వేగంగా అభివృద్ధి జరిగినట్లు సమాచారం. చెరువుకు సమీపంలో ఉన్న ఈ భూమిలో రోడ్లు, భవనాలు నిర్మించినట్లు తెలుస్తోంది. చెరువు పరిధి కూడా ఆక్రమించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల వివ రాల ప్రకారం.. ఈప్రాంతంలో గతంలో ఎ లాంటి నిర్మాణాలు లేకపోయినా, ఇటీవల భా రీ మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం.
జీఓ నంబర్ 59 దుర్వినియోగమా?
ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నం.59 (201 4), దానికి అనుబంధంగా జీఓ నం.12 (2015), జీఓ నం.14 (2022) ప్రకారం పేదల నివాస గృహాల కోసం మాత్రమే ఈ పథకం అమలు చేయాలి. ఈ జీఓ ప్రకారం.. 02-06-2014కి ముందు ఆక్రమణలో ఉండాలి. భూమిపై నివాస గృహం ఉండాలి. ఖాళీ స్థలాలకు వర్తించదు. డీడీ మహిళ పేరుతో ఇవ్వాలి. అయితే, ఖాజాగూడలో జరిగిన లావాదేవీలు ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఒకే ప్రణాళికలో భారీ లావాదేవీలు?
2018 నుంచి 2023 మధ్య కాలంలో 220, 240, 250 గజాలుగా విభజించి పలు ప్లాట్లు కేటాయించినట్లు సమాచారం. ముఖ్యం గా 2023 నవంబర్-, డిసెంబర్ మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు అనుమానాలకు కేంద్రబిందువుగా మారాయి. డాక్యుమెంట్ నంబర్లు 17914/ 2023, 17915/2023, 18032/2023, 180 33/2023, 18901/2023, 18902/2023, 19158/2023, 19159/2023, 19582/ 2023, 19583/2023 ద్వారా మొత్తం సుమా రు 2,500 చదరపు గజాల భూమి బదిలీ అయినట్లు తెలుస్తోంది.
ఒకే రోజు డీడ్.. అదే రోజు అమ్మకం!
ఈ వ్యవహారంలో అత్యంత కీలక అంశం ఏమిటం టే, ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇచ్చిన రోజునే అదే భూమి ప్రైవేట్ సంస్థకు అమ్మకానికి వెళ్లినట్లు సమాచారం. ఇది ప్రభుత్వ భూమిని మధ్యవర్తుల ద్వారా ప్రైవేట్ సంస్థలకు మళ్లించే పద్ధతిగా ఉందన్న అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ భూములు SYNYCS Homes LLP అనే సంస్థకు బదిలీ అయినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. ఈ సంస్థ పాత్రపై కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మహిళల పేర్ల నిబంధన ఉల్లంఘన..
జీఓ నంబర్ 59 ప్రకారం డీడ్లు మహిళల పేర్లతో ఉండాలి. అయితే ఈ కేసులో చాలా డీడ్లు పురుషుల పేర్లలో నమోదైనట్లు సమాచారం. ఇది నిబంధనల ఉల్లంఘనగా భావిస్తు న్నారు. నిర్మాణాలపై విభేదాలుకన్వేయన్స్ డీడ్లలో ఇళ్ల వివరాలు లేవు. కానీ సేల్ డీడ్లలో నిర్మాణాలు ఉన్నట్లు చూపించారు. పాత ఉపగ్రహ చిత్రాల్లో నిర్మాణాలు కనిపించకపోవడం మరింత అనుమానాలకు దారి తీస్తోంది. ఎన్నికల కోడ్ సమయంలోనే రిజిస్ట్రేషన్లు 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 5 వరకు ఎన్నికల మోడల్ కోడ్ అమల్లో ఉన్న సమయం లోనే ఈ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
కోర్ట్ పరిధిలో ప్రక్రియ?
సర్వే 58 కింద జరిగిన ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియ వినికిడి కోర్ట్ పరిధిలో కొనసాగినట్లు సమాచారం. ఎనిమిది మంది పేర్లతో 10 డాక్యుమెంట్లు రూపొందించి భూమిని రెగ్యులరైజ్ చేసినట్లు తెలుస్తోంది.
అధికారుల పాత్రపై అనుమానాలు
రెవెన్యూ శాఖ పర్యవేక్షణ లోపంతో ఈ అక్రమాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ టి.శ్రీని వాస్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి.అధికారాన్ని దుర్వినియోగం చేసి రిజిస్ట్రేషన్లకు సహకరించారా అన్న కోణంలో విచారణ చేపట్టాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
దర్యాప్తు చేయాలని డిమాండ్
ఈ వ్యవహారంలో అన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రజలు, స్థానిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖాజాగూడలో బయటపడిన ఈ భూఅక్రమాలు నగరంలో భూముల నిర్వహణపై తీవ్రమైన అనుమానాలు లేవనెత్తుతు న్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పారదర్శకం గా విచారణ జరిపితేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి.






