16 August, 2026 | 10:16 PM

గాంధీనగరం గురుకుల కళాశాలలో ర్యాగింగ్ కలకలం....

16-08-2026 09:11 PM

కారేపల్లి ఆగస్టు 16 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గాంధీనగరం గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలలో తలెత్తిన వివాదం కారణంగా శనివారం రాత్రి ఇంటర్మీడియట్ విద్యార్థులు ర్యాగింగ్ పేరిట టెన్త్ విద్యార్థులపై క్యాంపస్లో వెంబడించి తరుముతు ఇంటర్మీడియట్ విద్యార్థులు దాడి చేశారు.

మొదట ఇంటర్మీడియట్ విద్యార్థులు టెన్త్ విద్యార్థుల గదుల్లోకి వెళ్లి బట్టలు విప్పాలని, చీరలు కట్టుకోవాలని, రకరకాలుగా ర్యాగింగ్ కు పాల్పడగా టెన్త్ విద్యార్థులు తట్టుకోలేక బయటికి వచ్చారు. బయటికి వచ్చిన వారిని వదలకుండా సుమారు 40 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు టెన్త్ విద్యార్థులను ఉరికించుకుంటూ విచక్షణారహితంగా కొట్టారు. భయాందోళనతో విద్యార్థులు పరుగులు తీశారు. అడ్డుగా వచ్చిన హిందీ టీచర్ పై కూడా దాడి చేశారు. 20 మంది టెన్త్ విద్యార్థులు గాయపడగా వారి తల్లిదండ్రులు ఆదివారం గురుకులానికి వచ్చి ఆందోళన చేశారు. కారేపల్లి ఎస్ ఐ గోపీ కళాశాలకు వచ్చి విచారణ నిర్వహించారు.