2 August, 2026 | 12:51 PM

రైతుల కోసం యూరియా నిరసన – చెప్పులతో క్యూలైన్

03-09-2025 12:02 AM

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు తెల్లవారుజాముననే క్యూలైన్లో చెప్పులు వుంచి స్థానాలు ఆక్రమించుకోవడం, అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. రైతులు యూరియా కోసం పెద్ద క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం మూడుగంటలకే పిఏసిఎస్ కార్యాలయం ముందు బారులు తీరుతున్నారు. రైతులు వచ్చిన వెంటనే చెప్పులను వరుసలో పెట్టి తమ స్థానాలు సురక్షితం చేసుకుంటున్నారు.కానీ గంటల తరబడి ఎదురు చూసినా వారికి కావాల్సిన ఎరువులు అందడం లేదు.

దీంతో రైతుల ఆవేదన వెల్లువెత్తింది. పరిస్థితిని భరించలేక రైతులు అంబేద్కర్ చౌక్‌ వద్దకు తరలి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులు మేము ఇంత కష్టపడి క్యూలో నిలబడ్డా యూరియా దొరకట్లేదు. ఎరువులు అందకపోతే ఈ సీజన్ వృధా అవుతుంది."ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లాకు సరిపడా యూరియా సరఫరా చేసి, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.