1 August, 2026 | 3:53 PM

భద్రాచలం వద్ద ఉధృతమైన గోదావరి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

01-08-2026 03:03 PM

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

ఉదయం 11- మధ్యాహ్నం 1 గంటల మధ్య 56.10 అడుగులకు నీటిమట్టం చేరి..మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండడంతో.. ఉన్నతాధికారులకు పలు సూచనలు

​ఖమ్మం,(విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి నది మరింత ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సూచించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట సమయం దాకా గోదావరి వరద ఉధృతి 56.10 అడుగులుగా, 15,96,899 క్యూసెక్కులుగా,  మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న విషయం తెలుసుకుని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. 

​జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా అత్యవసర సమీక్ష

​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ లతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి తాజా పరిస్థితులపై ఎంపీ రఘురాం రెడ్డి ఆరా తీశారు. గోదావరి వరద ఉధృతి, సహాయక చర్యల తీరుపై చర్చించి సూచనలు చేశారు. ​నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున కరకట్టల వెంబడి, లీకేజీలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో సంబంధిత సిబ్బంది ద్వారా నిరంతరం గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ​ఏజెన్సీలో రాకపోకలు నిలిచిపోయిన ప్రాంతాల్లో.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రవాణా మరియు అత్యవసర సేవలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. నిర్వాసితులకు తాగునీరు, వైద్యం, భోజన వసతి సక్రమంగా అందేలా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.