ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు షురూ
పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన గంధం ఊరేగింపు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),నవంబర్21: మత సామరస్యానికి ప్రత్యేకగా నిలిచిన అర్వపల్లి సమీపంలోని హజ్రత్ ఖాజా నసీరుద్దీన్ బాబా రహ్మతుల్లా అలై 50వ సందల్ ఉర్సు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.సాయంత్రం 6గంటలకు అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు ప్రారంభమైంది.స్టేషన్లో ప్రార్థనలు జరిపిన అనంతరం నాగారం,తుంగతుర్తి సీఐలు, స్థానిక ఎస్సు,ముస్లిం మతపెద్దలు,నాయకులు గంధం పాత్రలను తలపై పెట్టుకొని ముస్లింల ఆచారాలకు అనుగుణంగా నడిచారు.
ఫకీర్ లు చువ్వలతో ఒంటినిండా పొడుచుకుంటూ జరబ్ నిర్వహించారు.అర్వపల్లి జంక్షన్ చివరి వరకు కాలినడకన ఊరేగింపుగా వచ్చి గంధంను సాగనంపారు.ఉర్సుకు ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.అలాగే దర్గా వద్ద రాత్రి హైదరాబాద్ డబుల్ పార్టీ వారిచే ఖవ్వాలి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో నాగారం, తుంగతుర్తి సీఐలు నాగేశ్వర్ రావు, నర్సింహారావు, ఎస్‌ఐ ఈట సైదులు,కాంగ్రెస్ జిల్లా నాయకులు గుడిపల్లి మధుకర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ వక్స్ బోర్డు ఇన్ స్పెక్టర్ ఎస్కే మహమూద్, ముజవార్ సయ్యద్ అలీ, అబ్దుల్ హుస్సేన్, నాయకులు పాలెల్లి సురేష్, ముస్లిం పెద్దలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






