హైదరాబాద్‌లో అమెరికా సంస్థ ప్రోటోల్యాబ్స్ జీసీసీ
300 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు
ప్రపంచ స్థాయి జీసీసీలకు అగ్రగామి గమ్యస్థానంగా హైదరాబాద్
ఐటీ, పరిశ్రమల శాఖ -మంత్రి శ్రీధర్‌బాబు
మంత్రితో భేటీ అయిన ప్రోటోల్యాబ్స్ ప్రతినిధి బృందం
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఆధునాతన ఇంజనీరింగ్, డిజిటల్ తయారీ సంస్థ ప్రోటోల్యాబ్స్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి గ్లోబల్ సామర్థ్య కేంద్రం(జీసీసీ) ఏర్పాటుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. దీని స్థాపనతో 300 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రోటోల్యాబ్స్ స్థానిక ఆరోహన్ గ్లోబల్ కన్సల్టెంగ్‌తో కలిసి ఈ జీసీసీని నెలకొల్పుతోంది. గురువారం ప్రోటోల్యాబ్స్ ప్రతినిధి బృందం సచివాలయంలో శ్రీధర్ బాబుతో బేటీ అయింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తమ విస్తరణ కార్యక్రమాలను వివరించారు.
జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం పట్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. గడచిన ఏడాది కాలంలో 80 జీసీసీలు ఇక్కడ ఏర్పాటయ్యాయని, అత్యాధునిక మౌలిక సదుపా యాలు, అద్భుతమైన ఎకో సిస్టం ఉండటం వల్ల జీసీసీలను ఆకర్షించగలుగుతున్నామని తెలిపా రు. డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు కూడా తెలంగాణ ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నైపుణ్యం ఉన్న ఇంజనీరింగ్ మానవ వనరులు, పటిష్టమైన డిజిటల్ మౌలిక వ్యవస్థ, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, వేగంగా విస్తరిస్తున్న తయారీ రంగం, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి జీసీసీలకు అగ్రగామి గమ్యస్థానంగా తీర్చిదిద్దాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
డిజైన్, ఇంజినీరింగ్, ప్రోటోటైపింగ్, తయారీ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా అధునా తన ఇంజినీరింగ్, డిజిటల్ తయారీ సాంకేతికతలు, ఉత్పత్తి అభివృద్ధి రంగాల్లో విస్తృత కార్యకలాపాలు సాగనున్నాయని, దీతో హైదరాబాద్ హై వ్యాల్యూ తయారీ రంగం లో మరింత శక్తివంతంగా ఎదుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రోటోల్యాబ్స్ రాకతో స్థానిక స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు), పెద్ద పరిశ్రమలకు ప్రోటోటైపింగ్ తయారీ సదుపాయాలు స్థానికంగా అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.
కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి మరింత వేగంగా తీసుకురావడానికి ఇది దోహదపడుతుందని వివరించారు. చైనాపై ఆధారపడే అవసరం తగ్గిపోతుందని చెప్పారు. ప్రోటోల్యాబ్స్ ప్రతినిధి బృందంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డాన్ షూమాకర్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అగ్నెస్ సెమింగ్టన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ కెర్మిష్, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ శర్మ ఉన్నారు. సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ పాల్గొన్నారు.






