09-11-2025 04:19:44 PM
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ రూ.8,260 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. వివిధ రంగాలలో అది సాధించిన సమగ్ర పురోగతిని ఆయన ప్రశంసించారు. ఈ సందర్బంగా రాష్ట్ర రజతోత్సవాన్ని జరుపుకునేందుకు జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ... 25 సంవత్సరాల క్రితం ఉత్తరాఖండ్ బడ్జెట్ కేవలం రూ.4,000 కోట్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు అది రూ.1 లక్ష కోట్లు దాటిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధానిగా మారగలదని, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో తీర్థయాత్ర కేంద్రాలు ఉన్నాయన్నారు.
ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రాజెక్టులు తాగునీరు, నీటిపారుదల, సాంకేతిక విద్య, ఇంధనం, పట్టణాభివృద్ధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధితో సహా అనేక కీలక రంగాలకు ఉపయోగపడతాయి. ఈ ప్రాజెక్టులలో అమృత్ పథకం కింద 23 మండలాలకు డెహ్రాడూన్ నీటి సరఫరా కవరేజ్, పిథోరగఢ్ జిల్లాలోని విద్యుత్ సబ్‌స్టేషన్, ప్రభుత్వ భవనాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు, నైనిటాల్‌లోని హల్ద్వానీ స్టేడియంలోని ఆస్ట్రోటర్ఫ్ హాకీ గ్రౌండ్ మొదలైనవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ ధామి, రాష్ట్రానికి చెందిన ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.