calender_icon.png 1 November, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట విషాదకరం

01-11-2025 03:01:52 PM

శ్రీకాకుళం:  ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం(Sri Venkateswara Swamy Temple) వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా పది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానన్నారు. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని పవన్ ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆయన ఆదేశించారు.

సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందన్న పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై ప్రభుత్వం విచారణ చేపడుతుందని వెల్లడించారు. కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని సూచించిన ఆయన క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి ఏపీ ఉపముఖ్యమంత్రి సూచించారు.