05-07-2025 12:05:09 AM
వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్త
ముషీరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): వైశ్యుల ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ’ఛలో హైదరాబాద్’ పేరుతో ఆగస్టు 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ’వైశ్య రాజకీయ రణభేరి’ కార్యక్రమాన్ని నిర్వహించ నున్నట్లు వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్త తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రణభేరికి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు.
జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులకు తగిన వాటా కల్పించాలన్నారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో వర్గీకరణ తేవాలన్నారు. వైశ్య కార్పొరేషన్ స్థాపించి, తగిన నిధులను కేటాయించాలని కోరారు. కులగణన నివేదికలోనే అగ్రవర్ణాల వివరాలు కులాల వారిగా ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
స్కిల్ యూనివర్సిటీలో వైశ్యులకు 25 శాతం సీట్లు కేటాయించాలని అన్నారు. విదేశీ విద్యా సహాయ నిధిని ఏర్పాటు చేసి వైశ్య విద్యార్థులకు తోడ్పాటు అందించాలన్నారు. వైశ్య బంధును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ’వైశ్య రాజకీయ రణభేరి’ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు.
వైశ్య వికాస వేదిక ప్రతినిధులు నంగునూరి రమేష్, రాజు గుప్త, అనంత రాములు గుప్త, వెంపటి వెంకటేశ్వర్లు, కొత్త రవి, వంగవీటి శ్రీనివాస్, దారా రమేష్, పశుపతి, నటరాజ్, రాంబాబు, దయాకర్, రామ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.