మహిళలకే రైస్ మిల్లులు ఇవ్వండి
- నిర్వహణ బాధలేందో తెలుస్తవి
- సీఎం రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
- రా రైసు మిల్లర్ల అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): ‘రైసు మిల్లుల నిర్వహణ బాధ్యత మహిళకే ఇవ్వండి. అప్పుడే ‘మా బాధలు, సమస్యలు ఏంటో తెలుస్తవి. మిల్లుల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు సీఎం రేవంత్‌రెడ్డి అప్పచెప్పడం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నాం’ అని రా రైసు మిల్లర్ల అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి తెలిపారు. మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా రైసు మిల్లుల ద్వారా వచ్చే లాభనష్టాలేంటో రైతులకు, ప్రజలకు కూడా తెలుస్తాయన్నారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న రైసు మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీఎంఆర్ అగ్రిమెంట్‌ను సవరించి.. రైసు మిల్లర్లు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించా లన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిల్లులకు ధాన్యం ఇచ్చిన తర్వాత 15 రోజుల్లోనే బియ్యం ఇవ్వాలంటే ఎలా సాధ్యమని, మాకు కచరా ధాన్యం ఇస్తే.. మీకు భూతద్దంలో పెట్టి చూసే బియ్యం ఇవ్వాలా..? అని గణపతి ప్రశ్నించారు. 14 ఏళ్ల నుంచి గన్నీ బ్యాగులు అవే పంపిస్తున్నారని, గన్నీ బ్యాగుల ధరలు కూడా ఫిక్స్ చేయాల న్నారు. రైసు మిల్లర్ల వద్ద ప్రభుత్వం బియ్యం తీసుకోవడం లేదని, 15 నెలల ప్యాడి డ్యామేజీ అవుతుందని, బాయిల్డ్ రైసు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తమ సమస్యలు పరిష్కరించాలని అప్పటి సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు లేఖ రాశారని గణపతిరెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ షరీఫ్ మాట్లాడుతూ ఏకపక్షంగా ఉన్న సీఎంఆర్ అగ్రిమెంట్‌ను సవరించి నిజాయితీగా నడిపే రైసు మిల్లర్లను ఆదుకోవాలన్నారు. క్వింటా వరి ధాన్యానికి 67 కిలోలు బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోందని, వాస్తవానికి 60 నుంచి 62 కిలోల బియ్యమే వస్తున్నాయని తెలిపారు. లంచాలు తీసుకునే అధికారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని, అవసరమైతే సీబీఐ విచారణ చేయించాలని ఆయన కోరారు. వందల కోట్లు ఎగవేసిన రైసు మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవాలన్నారు.






