17 August, 2026 | 2:01 AM

కేంద్ర క్యాబినెట్‌లోకి యువత, మహిళలు?

17-08-2026 01:27 AM
  1. ప్రధాని అధ్యక్షతన నేడు భేటీలో నిర్ణయానికి అవకాశం
  2. శాసనపరమైన ఏజెండాలపై సమీక్ష
  3. ఆర్థిక, పరిపాలనా చర్యలపై నిర్ణయాలు
  4. ఎర్రకోట వేదికగా ప్రధాని ప్రకటించిన ఆరు నిర్ణయాలపై సుధీర్ఘ సమీక్ష

న్యూఢిల్లీ, ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు (సోమవారం) నిర్వహించనున్న కేంద్ర క్యాబినెట్ భేటీలో మంత్రివర్గంలో మహిళలు, యువత కు దక్కే అవకాశం ఉన్నట్లు బీజేపీ పార్టీ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ప లుమార్లు క్యాబినెట్ భేటీలో ఈ అంశంపై సుధీర్ఘంగా చర్చించారు. అయితే క్యాబినెట్‌ను విస్తరిస్తారా? విస్తరిస్తే ఎవరెవరికి అవకాశాలు కల్పిస్తారు? పేర్లను ప్రకటిస్తారా? అన్నది భేటీ అనంతరం ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు 2027 ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2029 దేశవ్యాప్త ఎన్నికలు, ఇటీవల దేశంలో జరుగుతున్న జెన్ జీ పరిణామాల నేపథ్యంపై కూడా  చర్చించనున్నారు. ఏది ఏమైనా ఈ సమావేశంలో క్యాబినెట్‌లో మార్పుచేర్పులకు అవకా శం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల నిర్వహించిన పార్లమెంటరీ సమావేశాల్లోని శాసనపరమైన ఏజెండాలపై కూడా సమీక్షించనున్నారు. పరిపాలనా, ఆర్థిక చర్యలపై కూడా పలు నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని గ్యాస్ నిల్వల పెంపుదలపై పలు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. దీనిపై కూడా క్యాబినెట్‌లో సమీక్షించనున్నారు.

ఇంకోవైపు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి మోదీ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఆరు అంశాలపై కూడా సమీక్షించే అవకాశం ఉంది. ఇందులో కోటిమందికి ఉపాధి, మేడ్ ఇన్ ఇండియా నానో మైక్రో చిప్స్ తయారీకి కేంద్రంగా చేయడం, దీపావళికి ముందు నిత్యావసరాల ధరలను మరింత తగ్గించేందుకు పన్నులను తగ్గించడం, 2047 అభివృద్ధికి రోడ్ మ్యాప్ ( వికసిత్ భారత్ డాలర్ల ఎకానమీ దిశగా అడుగులు), దేశంలో నిర్మితమవుతున్న 10 న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణాలపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం.