25 August, 2026 | 11:26 PM

పచ్చదనాన్ని పెంచి ప్రకృతిని రక్షిద్దాం

25-08-2026 09:33 PM

- గజ్వేల్ ఎఫ్ ఆర్ ఓ వినాయక్ 

గజ్వేల్: ప్రజలంతా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచి ప్రకృతిని రక్షించాలని గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి వినాయక్ అన్నారు. మంగళవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు లక్ష్మాపూర్ అటవీ ప్రాంతంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న కౌన్సిలర్ భవాని కరుణాకర్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ కొలిచెలిమి స్వామి లతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ వినాయక్ మాట్లాడుతూ లక్ష్మాపూర్ అటవీ ప్రాంతంలో మంగళవారం రావి, మర్రి, వేప, అల్లనేరడు తదితర మొక్కలను నాటామన్నారు. రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న నాగరికతతో పాటు కాలుష్యం కూడా పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితే పచ్చదనం పెరిగి కాలుష్యాన్ని నివారించవచ్చున్నారు. గ్రామాల్లో మొక్కలు నాటడంతోపాటు రక్షించి చెట్లుగా ఎదిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ పవన్, అటవీ శాఖ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.