ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: జిల్లా జడ్జి
జిల్లా కోర్టు ప్రాంగణంలో వనమహోత్సవం
హాజరైన జడ్జీలు.. లాయర్లు
ఖమ్మం, జూన్ 5 (విజయక్రాంతి): పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కోర్టుల ప్రాంగణంలో న్యాయమూర్తులు మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఖమ్మం జిల్లా కోర్టుల ప్రాంగణంలో హరితోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ న్యాయవాదులు, జిల్లా అటవీ శాఖ అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఉదయం 10 గంటలకు జిల్లా అదనపు న్యాయమూర్తులు, జామ, మామిడి, ఉసిరి, మర్రి, రావి, కానుగ ఇతర మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, పాల్గొన్నారు. ఖమ్మం బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అదేవిదంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం పరిధి రేంజర్ మరియు సిబ్బంది మొక్కలు, నాటి, ట్రీ గార్డులు, ఎరువులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తులు మాట్లాడుతూ, ‘కాలుష్యం కోరలు చాస్తున్న నేటి కాలంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత అవసరం. ’మొక్కలు నాటుదాం - భవిష్యత్ను కాపాడుదాం’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మొక్క నాటడమే కాదు, అది వృక్షంగా ఎదిగే వరకు సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. న్యాయ స్థానాలు న్యాయంతో పాటు పచ్చదనానికి కూడా నెలవు కావాలి‘ అని ఆకాంక్షించారు. అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ ‘తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పర్యావరణ దినోత్సవం వారోత్సవాలు జరగనున్నాయని తెలిపారు.






