21 July, 2026 | 9:36 AM

పార్కు స్థలాన్ని కాపాడాలని ఆందోళన

20-07-2026 08:42 PM

- హయత్ నగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట వంటావార్పు 

- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుల డిమాండ్ 

ఎల్బీనగర్: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ మారుతీనగర్, ఆఫీసర్స్ కాలనీకి చెందిన పార్కు స్థలాన్ని కాపాడాలని హయత్ నగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు వంటావార్పు చేపట్టి, ఆందోళన నిర్వహించారు.  స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి భవన నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా బీజేపీ ఎల్బీనగర్ అసెంబ్లీ ఇన్ చార్జి సామ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో హయత్ నగర్ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా చేసివంటా–వార్పుతో నిరసన తెలిపారు.

కొన్ని రోజులుగా పార్కు స్థలం ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేకపోవడంపట్ల బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుల నిరసనకు స్పందించిన టౌన్ ప్లానింగ్ ఏసీపీ విజయలక్ష్మి అక్కడికి చేరుకుని పార్కు స్థలాన్ని పరిరక్షిస్తామని అక్రమంగా కబ్జా చేసి భవన నిర్మాణం చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్కు స్థలాన్ని జెసిబి సహాయంతో శుభ్రం చేయడం జరుగుతుందన్నారు.