గుట్టలో వరుణ యాగం
మూడో రోజూ ప్రత్యేక పూజలు
యాదగిరిగుట్ట, జూలై 22 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి అనుబంధ ఆలయం పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరాలయంలో మూడవ రోజు బుధవారం వర్ష పశుపత వరుణయాగం అర్చకులు ఘనంగా నిర్వహించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి పాడి,పంటలకు కొరత లేకుండా ప్రకృతి సస్యశ్యామలంగా తులతూగాలని ఆకాంక్షిస్తూ పూజలు చేపట్టారు.
పండితుల వేద మంత్రపఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ స్థాపిత దేవతా, రుష్యశృంగ, శివ, వరుణ జప విరాటపర్వ పారాయణముల వర్షపాశుపత హవన పూర్వక పూర్వాంగ విధులు పూజలు నిర్వహించారు. కాగా యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న వరుణ యాగం వల్లనే మంగళ, బుధవారాలు వర్షాలు కురుస్తున్నాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు.ఇలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్టిగా పండాలని ప్రజలు కోరుతున్నారు.






