ఏ రైతును కలవని కేసీఆర్‌కు.. ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పిందెవరు?
- రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్
- ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఆలోచన చేసిందే కాంగ్రెస్
- రైతులు ఇబ్బందుల్లో ఉన్నామని కేసీఆర్ కు చెప్పిందెవరు?
- బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో.. పోస్టుమార్టమ్ చేసుకోవట్లేదు
హైదరాబాద్: రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Vemulawada MLA Adi Srinivas ) CLP కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ, పంటలకు మద్దతు ధర చట్టాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ పాలన కాలంలో తరుగు పేరుతో రైతులను దోపిడీ చేశారని ఆరోపించారు. ఏ రైతును కలవని కేసీఆర్ కు తాము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పిందెవరు? అని ప్రశ్నించారు.
సారు బయటకి రారు.. ఎవరిని కలవరు.. అని స్వయంగా కేసీఆర్ కూతురు అన్నారు. రాష్ట్ర రైతులను పట్టించుకోని కేసీఆర్.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి చెక్కులు ఇచ్చారని కవిత అన్నారు. కవిత వ్యాఖ్యలపై సమాధానం చెప్పని కేసీఆర్.. కాంగ్రెస్ ను తప్పు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి రూ. 2800 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆది శ్రీనివాస్ లెక్క చెప్పారు. వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ ఇవాళ పంజాబ్ ను అధిగమించిందని తెలిపారు. ఈ సీజన్ లో కూడా 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం నడుపుతోందన్నారు.
మసిపూసి మారెడుకాయ చేయడం.. బీఆర్ఎస్ నేతలకు అలవాటు
మసిపూసి మారెడుకాయం చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ధాన్యానికి బోనస్ గా రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ. 3 వేల కోట్లు వేశామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వరికి బోనస్ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ కు ఎప్పుడైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతు బంధు ఒక్కటి అమలుచేసి అన్ని పథకాలు నిలిపివేశారని పేర్కొన్నారు. పంట నష్టపరిహారం, వ్యవసాయ పరికరాలకు సబ్సీడిని నిలిపివేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం రైతుభరోసాతో పాటు గతంలోని పథకాలను అమలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో... పోస్టుమార్టమ్ చేసుకోవట్లేదని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.






