16 April, 2026 | 3:33 AM

నేతల మధ్య మాటల కోటలు దాటాయ్.. గద్వాలలో కాంగ్రెస్‌లో కలకలం

16-04-2026 01:49 AM

గద్వాల, ఏప్రిల్ 15 : గద్వాలలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరి, ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ ఎంపీ సమక్షంలోనే ఈ వివాదం చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను వెల్లడించింది. మంగళవారం బీఅర్‌ఎస్కు చెందిన కౌన్సిలర్, పలువురు నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు.

అయితే, ఈ చేరికలు ఎక్కడ జరగాలి అన్న విషయంలో డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ సరిత మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రజా బంగ్లాలోనే చేరికలు నిర్వహించాలని రాజీవ్ రెడ్డి పట్టుబట్టగా, ఇంతకాలం లేని ప్రజా బంగ్లా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని సరిత తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ క్రమంలో  సరిత నివాసం వేదికగా చేరికలు చేపట్టేందుకు ఏర్పాట్లు జరగడంతో, అక్కడికి చేరుకున్న రాజీవ్ రెడ్డి ఇది సరైన వేదిక కాదు అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరి, వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్లినట్లు సమాచారం.

పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి జోక్యం చేసుకుని ఇరువురినీ శాంతింపజేయడానికి ప్రయత్నించారు. పరిస్థితిని బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ సమన్వయం సాధించేందుకు యత్నించినా, నేతలు మాత్రం తమ తమ వైఖరిపై గట్టిగా నిలబడ్డారు. ఈ సందర్భంగా సరిత, మీ వల్లే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతోంది అంటూ రాజీవ్ రెడ్డిపై ఆరోపణలు చేయడం మరింత వివాదానికి దారితీసింది.

చివరికి అన్ని వాదోపవాదాల నడుమ, చేరికలు సరిత నివాసంలోనే జరగడం గమనార్హం. ఈ ఘటనతో గద్వాల కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేతల మధ్య సమన్వయం లోపిస్తే పార్టీకి నష్టం తప్పదని స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.