ఇండ్ల కూల్చివేతపై బాధితుల ఫిర్యాదు
మొయినాబాద్, జనవరి 1 (విజయ క్రాంతి): కాయాకష్టం చేసి పైసా పైసా కూడబెట్టి, ఉన్న భూములను అమ్ముకుని ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్న తమ కలలను మట్టిపాలు చేశారని పెద్దమంగళారం గ్రామంలోని రాఘవేంద్ర సొసైటీ వెంచర్కు చెందిన గిరిజన బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకునే వారు ఎవరూ లేరని, పోలీసులే న్యాయం చేయాలని కోరుతూ గురువారం బాధితులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం గ్రామంలోని రాఘవేంద్ర సొసైటీ వెంచర్లో సుమారు 50 మంది గిరిజన కుటుంబాలు ప్లాట్లు కొనుగోలు చేశామని, కొందరు ఇండ్లు కట్టుకుని నివాసం కూడా ఉంటున్నామని బాధితులు తెలిపారు.
అయితే కొందరు వ్యక్తులు వచ్చి తమ భూమిలో అక్రమంగా ఇండ్లు కట్టుకున్నారని, కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ భయభ్రాంతులకు గురి చేసి బౌన్సర్లతో దాడులు చేయించి ఇండ్లను కూల్చివేశారని ఆరోపించారు. ఇండ్ల కూల్చివేతకు శ్రీనివాస్ రాజు, డి. సురేష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజుగౌడ్లు కారణమని గురువారం గిరిజన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, తాము కట్టుకున్న ఇండ్లు, ప్లాట్లకు వేసిన ప్రహారీ గోడలను కూడా కూల్చివేశారని, తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరామని తెలిపారు. ప్లాట్లు చేసిన భూమిని శ్రీనివాస్ రాజు, సురేష్ రెడ్డిలు రాఘవేంద్ర సొసైటీ నుంచి కొనుగోలు చేశామని చెబుతున్నా వారు ఎందుకు ముందుకు రావడం లేదని బాధితులు ప్రశ్నించారు.
వారి తరఫున రాజకీయ అండదండలతో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మాత్రమే ముందుకొచ్చి గత కొన్ని రోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము న్యాయంగా ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నామని, అయినా మూడు రోజుల క్రితం తెల్లవారు జామున సుమారు వంద మంది పోలీసులు, వంద మంది బౌన్సర్లతో వచ్చి ఇండ్లు ఖాళీ చేయాలని దాడులు చేశారని వాపోయారు. అనంతరం మున్సిపల్ అధికారులు, సిబ్బంది వచ్చి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెబుతూ, నోటీసులు ఇవ్వకుండానే నిర్దాక్షిణ్యంగా ఇండ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ సరఫరా నిలిపివేసి, సీసీ కెమెరాలను పగులగొట్టి ఇండ్లను కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. భూమి వారిదే అయితే తెల్లవారు జామున ఎందుకు వచ్చి కూల్చారని, అక్రమ నిర్మాణాలైతే ముందుగా నోటీసులు ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇండ్లను కూల్చి తమ బతుకులను రోడ్డుపై పడేశారని కన్నీరు పెట్టుకున్నారు. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోలీస్ స్టేషన్కు వచ్చి, ఇండ్లు కూల్చివేయడానికి కారణమైన వారిపై ఫిర్యాదు చేశామని, పోలీసులు చర్యలు తీసుకుని న్యాయం చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.






