calender_icon.png 2 January, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులెక్కడ?

02-01-2026 01:02:46 AM

15వ ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర గ్రాంట్ల విడుదలపై అనిశ్చితి

పంచాయతీ నిధులపై ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): తెలంగాణలో గ్రామ పంచాయతీ లకు నిధుల విడుదల పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వాస్తవానికి నిధులు విడుదల చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికలను సాకు గా చూపుతూ జాప్యం చేస్తూ వచ్చింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు పూర్తికావడంతో గ్రామ పంచాయతీలకు నిధులు ఎప్పుడు విడుదలవుతాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అయినా గ్రామ పంచాయతీలకు కీలకమైన నిధుల విడుదలపై మాత్రం ఇంకా స్పష్టత లేకపోవ డంతో గ్రామాల్లో ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ అవుతాయా, ఎప్పుడు వస్తాయా అనే చర్చ గ్రామాల్లో విస్తృతంగా జరుగుతోంది.

ఎన్నికల అనంతరం గ్రామాభివృద్ధి పను లు ఊపందుకుంటాయని ప్రజలు ఆశించినా, పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ కాకపోవడంతో అభివృద్ధి పనులు కదలని పరిస్థితి నెలకొంది. డ్రైనేజీలు, రోడ్ల మరమ్మతులు, పారిశుధ్యం, తాగునీటి సమస్య లు యథాతథంగా కొనసాగుతున్నాయి.

కేంద్రం నుంచి స్పష్టత కరువు..

పంచాయతీ ఎన్నికలు పూర్తున నేపథ్యం లో గ్రామ పంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు, ఇతర కేంద్ర గ్రాంట్లు విడు దల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు పూర్తయి పాలకమండళ్లు ఏర్పడ్డాయని, పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

అయితే ఆ లేఖపై ఇప్పటివరకు కేంద్రం నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడంతో నిధుల విడుదలపై అయోమయం కొనసాగుతోంది. ఎన్నికలు జరగకపోవడంతో గత కొంతకాలంగా 15వ ఆర్థిక సం ఘానికి సంబంధించిన నిధులు నిలిచిపోయాయి. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, రాష్ట్ర వాటా కలిపి వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు పెండింగ్లో ఉన్నట్లు అంచనా.

ఈ నిధు లు విడుదలైతే గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, స్ట్రీట్ లైట్స్, గ్రామాభివృద్ధి పనులు మళ్లీ గాడిలో పడతాయని అధికారులు భావిస్తున్నారు. కానీ కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు రాకపోవడంతో ట్రెజరీ స్థాయిలో చలనం కనిపించడం లేదు.

అయితే పంచాయతీ ఎన్నికల తర్వాత నిధుల విడుదలకు సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ నుంచి ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వులు రావాల్సి ఉం టుంది. ఈ ఉత్తర్వులు వెలువడిన తర్వాతే ట్రెజరీ ద్వారా నిధుల విడుదలకు మార్గం సుగమమవుతుంది. కానీ కేంద్రం నుంచి రాకపోవడంతో జీవో విడుదల కావడంలో జాప్యం జరుగుతున్నది.

పెండింగ్‌లో పెద్దమొత్తం..

కేంద్ర 15-వ ఆర్థిక సంఘం నిధులు రూ.3,000 కోట్ల వరకు విడుదల కాలేదు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటులు ఎన్నికల తర్వాత మాత్రమే విడుదలయ్యేలా నిబంధన ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధులతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, స్ట్రీట్ లైట్స్, సిబ్బంది జీతాలు వంటి అత్యవసర అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. ఈ నిధుల ఆలస్యంతో గ్రామాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలవ్వాలంటే వెంటనే నిధులు విడుదల చేయాలని గ్రామస్థులు, సర్పంచులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మాత్రం బడ్జెట్ కేటాయింపులు, కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆధారపడి దశలవారీగా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేస్తోంది. దీనికితోడు గతంలో పంచాయతీల అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.531 కోట్ల వరకు ఉన్నాయని కూడా అధికారిక వర్గాలు ప్రకటించాయి.

గ్రామాభివృద్ధి పను లు పూర్తి అయిన తర్వాత కూడా బిల్లులు విడుదల కాకపోవడంతో పెండింగ్ సమస్య వెంటాడుతోంది. నిధుల విడుదలపై స్పష్టత రాకపోవడంతో గ్రామాల్లో అసంతృప్తి, ఆం దోళన నెలకొంటుంది. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, స్ట్రీట్ లైట్స్ కరెంట్ బిల్లులు, పాత అభివృద్ధి పనుల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో కొత్త పాలకవర్గాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీంతో నిధులు విడుదల కాకపోతే గ్రామాభివృద్ధి ముందుకు సాగదన్న వాస్తవం ఇప్పుడు మరోసారి స్పష్టమ వుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర నుంచి విడుదలయ్యే గ్రాంట్ల వైపుగా కొత్త పాలక మండళ్లు ఎదురుచూస్తు న్నాయి. పంచాయతీ నిధుల విడుదలకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.