8 April, 2026 | 3:32 AM

జాతీయస్థాయిలో విజ్ఞాన్స్ అధ్యాపకుడు సత్తా

08-04-2026 01:42 AM

ప్రతిభ చూపిన డాక్టర్ ఎస్‌సాయి శివ

డీఆర్డీవో ‘డేర్ టు డ్రీమ్ 5.0’ పోటీల్లో ద్వితీయ బహుమతి 

హైదరాబాద్, ఏప్రిల్ 7(విజయక్రాంతి): రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘డేర్ టు డ్రీమ్ 5.0’ ఇన్నోవేషన్ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. సాయి శివ(ఫిజిక్స్) అద్భుత విజయాన్ని సాధించారు.ఈ పోటీల్లో వ్యక్తిగత విభాగంలో ఆయన ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు.

భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలకు పెను సవాలుగా మారనున్న ‘అంతరిక్ష వ్యర్థాల’ను లేజర్ సాంకేతికత ద్వారా ఎలా తొలగించవచ్చో వివరిస్తూ డాక్టర్ సాయి శివ సమర్పించిన పరిశోధనా ప్రతిపాదన ఈ బహుమతికి ఎంపికైంది.ఆయన ప్రతిభకు గుర్తింపుగా డీఆర్డీవో రూ. 5 లక్షల నగదు బహుమతిని అందజేయనుంది. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మృత్యర్థం డీఆర్డీవో ఈ పోటీలను నిర్వహిస్తోంది.

అంతరిక్ష వ్యర్థాల వల్ల ఉపగ్రహాలకు కలిగే ముప్పును నివారించేందుకు ‘లేజర్ బేస్డ్ స్పేస్ డెబ్రిస్ రిమూవల్’ అనే నూతన విధానాన్ని డాక్టర్ సాయి శివ ప్రతిపాదించారు.దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది పరిశోధకులు, విద్యావేత్తలు పాల్గొన్న ఈ పోటీలో ద్వితీయ స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ సాయి శివ మాట్లాడుతూ   ‘ప్రస్తుతం అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థాలు మన శాటిలైట్ వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారాయి.

ఈ సమస్యకు పరిష్కారంగా నేను ‘లేజర్ బేస్డ్ స్పేస్ డెబ్రిస్ రిమూవల్’ అనే నూతన విధానాన్ని ప్రతిపాదించాను. భూమి నుంచి లేదా కక్ష్యలోని ప్లాట్‌ఫారమ్‌ల నుంచి లేజర్ కిరణాలను ప్రయోగించడం ద్వారా ఈ వ్యర్థాల వేగాన్ని నియంత్రించి, వాటిని సురక్షితంగా భూ వాతావరణంలోకి పంపి మండిపోయేలా చేయవచ్చు.నా పరిశోధనకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, అబ్దుల్ కలాం పేరు మీద ఉన్న అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది. ఇది నా బాధ్యతను మరింత పెంచిందన్నారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు డాక్టర్ సాయి శివను అభినందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ‘డాక్టర్ సాయి శివ సాధించిన ఈ విజయం విజ్ఞాన్స్ యూనివర్సిటీకి మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. వేలాది మంది పరిశోధకులు పాల్గొన్న జాతీయ స్థాయి పోటీలో మన అధ్యాపకుడు ద్వితీయ స్థానంలో నిలవడం ఆయన మేధస్సుకు నిదర్శనం.మన దేశ రక్షణ, అంతరిక్ష రంగాలకు ఉపయోగపడే ఇలాంటి వినూత్న పరిశోధనలను విజ్ఞాన్స్ యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెపారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని గొప్ప ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని యూనివర్సిటీ డైరెక్టర్ పేరొన్నారు. డాక్టర్ సాయి శివకు ఆయా విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపక బృందం, విద్యార్థులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.