ప్రకృతి బాగుంటేనే ప్రజారోగ్యం
అస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
హైదరాబాద్, ఏప్రిల్ 7(విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమీర్‌పేటలోని అస్టర్ ప్రైమ్ హాస్పిటల్ మంగళవారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో పర్యావరణం కీలక పాత్ర పోషిస్తుందనే సందేశాన్ని చాటుతూ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సీనియర్ వైద్యులు, మెడికల్, నాన్-మెడికల్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. కేవలం వ్యాధుల చికిత్సకే పరిమితం కాకుండా, సంపూర్ణ ఆరోగ్యానికి పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని వైద్యులు గుర్తుచేశారు.
మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన
పర్యావరణంతో పాటు మానసిక ఆరోగ్యం పట్ల కూడా అవగాహన కల్పించారు. ఒత్తిడి లేని జీవనశైలిని అలవర్చుకోవాలని, భావోద్వేగ సమతుల్యతను పాటిం చాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుత కాలంలో శారీరక ఆరోగ్యంతో సమానంగా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
అస్టర్ ప్రైమ్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ హరి కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘ఆరోగ్యం అంటే కేవలం రోగాలు లేకపోవడం మాత్రమే కాదు; శారీరక, మానసిక, పర్యావరణ సమతుల్యత కలిగి ఉండటం.ఈ రోజు మేము నాటిన ఈ మొక్క, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం మా నిబద్ధతకు ప్రతీక. నేడు మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలే రేపటి సమాజ ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి’, అని పేర్కొన్నారు.అన్ని విభాగాల సిబ్బంది కలిసికట్టుగా పాల్గొన్న ఈ కార్యక్రమం, నివారణ ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ స్పృహ పట్ల ఆసుపత్రికి ఉన్న బాధ్యతను చాటిచెప్పింది.




