17-02-2026 12:02:19 AM
నెట్టింట చక్కర్లు కొడుతున్న విజయ్ వెడ్డింగ్ కార్డు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. ‘మేము కేవలం మంచి స్నేహితులమే’.. అంటూ ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చిన ఈ జంట.. నిజంగానే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఓ రాయల్ ప్యాలెల్‌లో జరగనుందని నెట్టింట వార్తలు వచ్చాయి. తాజాగా ‘విజయ్ వెడ్డింగ్ ఇన్విటేషన్’ అంటూ సోషల్‌మీడియాలో ఓ ఆహ్వాన పత్రిక దర్శనమివ్వడం ఈ పెళ్లి వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది. ఈ ఆహ్వాన పత్రిక ప్రకారం.. విజయ్ పెళ్లి ఫిబ్రవరి 26 తేదీన జరగనుంది. తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
అయితే, విజయ్ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విజయ్ దేవరకొండ పెళ్లి జరుగుతున్నది నిజమే అని తెలుస్తున్నా.. ఎప్పుడు? ఎక్కడ? అన్న వివరాలను వారి పీఆర్ టీమ్ వెల్లడించడం లేదు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సాదాసీదాగా వివాహ తంతు జరపనున్నారని సమాచారం. హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది.