విజయ డెయిరీ అమ్మకాలు పెంచాలి
- పూర్తి లాభాల బాట పట్టించాలి
- వచ్చిన మొత్తాన్ని రైతుల సంక్షేమానికి ఖర్చు పెట్టాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- సీఎంను కలిసిన డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మన్ అమిత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): విజయ డెయిరీని మరింత లాభాల్లోకి తీసుకొచ్చేందుకు పట్టుదలతో పని చేయాలని, సంస్థకు వచ్చిన లాభాలను పాడి రైతుల సంక్షేమానికి ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా అమిత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది కావడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం జూబ్లీహిల్స్‌ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
గతంలో ప్రతి నెల రూ. 10 కోట్ల మేర నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని లాభాల్లోకి తీసుకొచ్చామని అమిత్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విజయ డెయిరీని లాభాల్లోకి తీసుకొచ్చిన అమిత్‌రెడ్డి పని తీరు అభినందనీయమన్నారు. విజయ డెయిరీని లాభాల బాట పట్టించిన స్ఫూర్తితో మరింత పట్టుదలతో పని చేసి.. వచ్చిన లాభాలను సంస్థ ద్వారా పాడి రైతుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.
మరో ఏడాది కాలంలో విజయ తెలంగాణ డెయిరీ అమ్మకాలను పెంచి, సమాఖ్యను పూర్తిగా లాభాల్లోకి తీసుకురావాలని సీఎం సూచించారు. మరో సంవత్సర కాలంలో విజయ డెయిరీ అమ్మకాలను పెంచి, సమాఖ్యను పూర్తి లాభాల్లోకి తీసుకు వస్తానని, అందుకు పక్కా ప్రణాళికతో పని చేస్తున్నామని అమిత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని అమిత్‌రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కలిసిన వారిలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరెకల నర్సారెడ్డి తదితరులు ఉన్నారు.






