కేజీబీవీలు ఉత్తమ విద్యా ప్రమాణాలకు ఆదర్శం
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
రామాయంపేట, సెప్టెంబర్ 5 : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం రామాయంపేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ తరగతి గదులు, వంటశాల, హాజరు పట్టిక, మధ్యాహ్న భోజన నాణ్యత, వసతి గదులు, ఫర్నిచర్, పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించారు.
విద్యార్థినులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలనీ, శుద్ధమైన త్రాగునీరు తప్పనిసరిగా అందించాలని ఆయన సూచించారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ఎంతో గొప్ప బాధ్యత నిర్వర్తిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని కేజీబీవీలు విద్యా ప్రమాణాల్లో ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






