27 April, 2026 | 2:46 AM

పౌల్ట్రీ ఫార్మ్ దుర్వాసన.. గ్రామం విలవిల

27-04-2026 12:57 AM

పెద్ద శివనూర్ ప్రజల ఆందోళన తీవ్రం

చేగుంట, ఏప్రిల్ 26: చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో పౌల్ట్రీ ఫార్మ్ కారణంగా వస్తున్న తీవ్రమైన దుర్వాసనతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం గ్రామస్థులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. గ్రామానికి అతి సమీపంలో ఉన్న ఈ పౌల్ట్రీ ఫార్మ్ వల్ల ఆరోగ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యం పెరిగిపోయాయని వారు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్ద శివనూర్ గ్రామానికి కేవలం 70 మీటర్ల దూరంలో ఈ పౌల్ట్రీ ఫార్మ్ ఏర్పాటు చేయబడింది.

ఇందులో సుమారు 1,50,000 లేయర్ కోళ్లు ఉండగా, ఒకే ప్రదేశంలో 13 షెడ్లు నిర్మించబడ్డాయి. ఇంత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న ఫార్మ్ నుంచి నిరంతరం వచ్చే దుర్గంధ వాసన గ్రామమంతట వ్యాపిస్తూ ప్రజలకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తోంది. గ్రామంలోని మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని గ్రామ పెద్దలు తెలిపారు. రాత్రి సమయాల్లో దుర్వాసన మరింత ఎక్కువగా ఉండటం వల్ల నిద్రపోవడానికే కష్టంగా మారిందని వారు వాపోయారు.

ఈ సమస్యపై గ్రామస్థులు పలుమార్లు పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజల ఫిర్యాదుల మేరకు పంచాయతీ కార్యదర్శి ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవో మరియు ఇతర అధికారులకు లేఖలు పంపినట్లు గ్రామస్తులు వెల్లడించారు. . పౌల్ట్రీ ఫార్మ్ను గ్రామానికి దూరంగా తరలించాలి లేదా సరైన కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు.  ప్రస్తుతం పై అధికారుల నివేదిక కోసం ఎదురుచూస్తున్నాము. వారి ఆదేశాల మేరకు త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.