07-12-2025 07:30:39 PM
నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం..
చిట్యాల (విజయక్రాంతి): అధికార పార్టీకి చెందిన సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల మండలంలో వివిధ గ్రామాలలో సర్పంచ్, వార్డు మెంబర్ల గెలుపు కోసం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రజాప్రతినిధులుగా ఉంటేనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు.
గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలంటే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రజాప్రతినిధులుగా ఉంటేనే అది సాధ్యమవుతుందని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో పెండింగ్ ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను ఎన్నికల అనంతరం వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్, డిసిసి ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, అంతటి నరసింహ గౌడ్, ఆవుల యాదయ్య, సురికి లింగస్వామి, అందే రాములు, బండ గిరిజ, అమనగంటి పారిజాత, సాగర్ల యాదమ్మ, జోగు సురేష్, మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్, మాజీ ఎంపిటిసి వడ్డేపల్లి లక్ష్మయ్య, జనగాం అంజయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.