07-12-2025 07:26:17 PM
నియోజకవర్గంలో 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం!!
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో ఎల్లారెడ్డి నియోజకవర్గo ఏకగ్రీవ పంచాయితీలతో టాప్ వన్ గుర్తింపు వైపు దూసుకెళ్తుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నియోజకవర్గంలో ఉంటూ గ్రామాల ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండడం వల్ల ఏకగ్రీవంగా సర్పంచ్ లను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. వెనుకబడిన ప్రాంతమైన ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని పల్లెల్లో రాజకీయ వర్గ విభేదాల పోరు ఉండవద్దని గ్రామంలో ఉంటూ సేవా దృక్పథం కలిగిన వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని గతంలోనే ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునివ్వడంతో నిజాయితీ సేవా దృక్పథం కలిగిన వారిని గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నుకుంటున్నారు.
నియోజకవర్గంలో 222 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటివరకు 46 గ్రామాలలో ఏకగ్రీవంగా సర్పంచులను ప్రజలు ఎన్నుకున్నారు. అధికారులు అధికారికంగా ప్రకటించవలసి ఉంది. మరికొన్ని గ్రామాల్లో సైతం ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకోవడానికి చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 46 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం కావడం తేలికైనా విషయం కాదని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం ఆవిర్భవించి నప్పటి నుండి ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్నిక కాలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వం, అభివృద్ధిపట్ల ఆయన దృక్పథం, గ్రామస్థులతో నిరంతర అనుసంధానం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
నియోజకవర్గంలో రహదారులు, విద్యుత్, తాగునీరు, సాగునీటి సదుపాయాల మెరుగుదలతో పాటు అనేక సంక్షేమ పథకాల అమలులో ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అవినీతికి చోటు లేకుండా చేశారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో నెలకొన్న నమ్మకం, గ్రామస్థుల ఐక్యత, శాంతియుత వాతావరణం కావాలని కోరుకుంటున్న పల్లె ప్రజలకు ఏకగ్రీవాల వైపు మొగ్గుచూపడం ఆసక్తిదాయకంగా పరిగణించవచ్చు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ గ్రామాల్లో ఎన్నికల హడావుడి లేకపోవడం ఆనందదాయకంగా ఉందని ఆ గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతిపక్షం పత్త లేకుండా పోవడం పట్ల బీఆర్ఎస్ గ్రామస్థాయి నాయకుల్లో ఆందోళన మొదలైంది. నాయకుడు లేని నావల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి ఆధారంగా ప్రజలు ఇచ్చిన ఈ ఏకగ్రీవ తీర్పు స్థానిక నాయకత్వానికి పెద్ద విజయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
మండలాల వారీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచుల వివరాలు ఇలా ఉన్నాయి:
నాగిరెడ్డిపేట్ మండలంలో 6 పంచాయతీలు
లింగంపేట మండలంలో 14 పంచాయతీలు
ఎల్లారెడ్డి మండల పరిధిలో 5 పంచాయతీలు
గాంధారి మండల పరిధిలో 16 పంచాయతీలు
సదాశివనగర్ మండలం పరిధిలో 3 గ్రామ పంచాయతీలు
రాజంపేట మండలంలో 2 పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా విజయం సాధించడం జరిగింది. అధికారికంగా అధికారులు ప్రకటించవలసి ఉంది. ఏకగ్రీవాలతో నియోజకవర్గంలో తనదైన శైలితో ప్రజలను ఆకట్టుకుంటున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రాజకీయ ఉద్దండుడని పలువురు విశ్లేషిస్తున్నారు.