వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): తిరుమలాయపాలెం(Thirumalayapalem) మండలంలోని బచ్చోడు, జూపెడ, కాకరవాయి గ్రామాల్లో వినాయక చవితి పండుగ సందర్భంగా ఎస్సై జగదీష్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు, గ్రామ పెద్దలు, యువతతో సమావేశమై పండుగ నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై సూచనలు చేశారు. వినాయక చవితి నవరాత్రులు, నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌లకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. మండపాల వద్ద భద్రతా చర్యలు పాటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. పోలీసులకు సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా వేడుకలు నిర్వహించాలని ఎస్సై జగదీష్ సూచించారు. యువత ఉత్సాహంగా పాల్గొంటూనే పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.