29 July, 2026 | 12:48 AM

వివేకవంతమైన వ్యవహారాలు

29-07-2026 12:00 AM

క్రుద్ధేనార్తేన, మత్తేన, ఉన్మత్తేన, 

అవగృహీతేన, వా కృతా వ్యవహారాః న సిధ్యేయుః

కర్తృకారయితృ శ్రోతౄణాం పృథగ్యథోక్తాః దండాః (కౌటిలీయం 3

ఆచార్య చాణక్య అర్థశాస్త్రంలోని మూడవ అధికరణంలో వ్యవహారాలు, వ్యవహారానికి ఆధారాలు, న్యాయస్థానాల లక్ష్యాలు, న్యాయమూర్తి లక్షణాలను, అవసృష్ట వ్యవహారాలను గురించిన వివిధ విషయాలను చర్చించారు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది మధ్య హక్కులు, ధనం, ఆస్తి లేదా ఇతర ఒప్పందాలకు సంబంధించిన వివాదాన్ని న్యాయస్థానం ద్వారా పరిష్కరించడం ‘వ్యవహారం’గా చెపుతారు. వ్యవహారానికి ఆధారాలుగా శాస్త్రాలను, నైతిక నియమాలను, న్యాయస్థానంలో నిరూపితమైన సాక్ష్యాలను, విచారణ చేసిన నివేదికలను, స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు, రాజశాసనాలను, రాజు జారీచేసిన చట్టాలు, ఆదేశాలు వీటిని సమన్వయపరచి, న్యాయనిర్ణయం చేయడాన్ని పేర్కొంటారు.

అలాగే న్యాయస్థానం ఏ ఒక్కరికో అనుకూలంగా తీర్పు చెప్పడం కాదు. ధర్మాన్ని, సత్యాన్ని, సాక్ష్యాలను ఆధారం చేసుకొని తీర్పు చెప్పడం న్యాయస్థాన లక్ష్యాలుగా చెపుతారు. తీర్పరి రాజైనా ధర్మానికి లోబడి ఉండాలని చాణక్యుడు స్పష్టంగా చెపుతాడు. న్యాయాధికారి ఎప్పుడూ కోపం, లోభం, భయం, పక్షపాతం లాంటి ప్రలోభాలకు లోను కాకూడదు. ప్రశాంత మనస్కుడై ఇరుపక్షాల వాదనలను వినాలి. సాక్షులను జాగ్రత్తగా పరీక్షించాలి. తొందరపడి తీర్పు ఇవ్వకూడదు, అంటారాయన. అలాగే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భద్రపరచమని లేదా అప్పుగా ఇచ్చిన ఆస్తిపాస్తులకు సంబంధించిన న్యాయ వివాదాలను ‘అవసృష్ట వ్యవహారాలు’ అన్నారు.

చాణక్యుని దృష్టిలో న్యాయవ్యవస్థ ప్రజల విశ్వాసాన్ని, సామాజిక క్రమాన్ని నిలుపుతూ, రాజ్య ఔన్నత్యాన్ని కాపాడాలి. సామాజిక క్రమత అనడంలో సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యతలు గుర్తించడం, వారి హక్కులు కాపాడబడడం, పౌరుల ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, ఒప్పందాలు సజావుగా నియమానుసారంగా, గౌరవప్రదంగా సాగడం, లావాదేవీలలో ఎదురయ్యే సమస్యలను న్యాయస్థానాల ద్వారా పరిష్కారం చేసుకోవడం, ఆర్థిక లావాదేవీలలో నమ్మకాన్ని పెంపొందించడం. చాణక్యుడు న్యాయవ్యవస్థను కేవలం శిక్షించడానికి పరిమితం చేయలేదు.

పై శ్లోకం ద్వారా చాణక్య, అవసృష్ట వ్యవహారాలలో.. కోపంతో ఉన్నవాడు, మత్తులో ఉన్నవాడు, ఉన్మాది, ఇతరుల ఆధీనంలో ఉన్నవాడు చేసిన న్యాయ సంబంధిత వ్యవహారాలు చెల్లవు, అంటాడు. దీనికి కారణం మానసిక సమతుల్యత లేని స్థితిలో వ్యక్తికి వివేకవంతమైన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునే సామర్థ్యం ఉండదని భావన. ఈ సూత్రం ఈనాటి న్యాయవవస్థలోనూ కనిపిస్తుంది. అలాంటి వ్యవహారాలు చెల్లవని తెలిసీ న్యాయస్థానానికి తీసుకువస్తే.. చేసిన వారిని, చేయించిన వారినీ, సాక్షులనూ దండనీతి శాస్త్రాన్ని అనుసరించి తగిన విధంగా వేరువేరుగా దండించాలి, అంటారు చాణక్య.

ఇక్కడ చాణక్యుడు చాలా ముందుచూపుతో, మనిషి మానసిక స్థితిని న్యాయానికి ప్రామాణికంగా తీసుకున్నాడు. మానసిక సమతుల్యత లేకుండా తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత లేదనడం ద్వారా న్యాయం అనేది కేవలం సంతకం చేయడమో లేదా నోటిమాట మీదనో ఆధారపడదని, ఆ నిర్ణయం స్వేచ్ఛగా, వివేకంతో తీసుకున్నదా, లేదా అనే అంశాన్ని న్యాయస్థానం నిశితంగా పరిశీలించాలని సూచించాడు.

మహాభారతంలో ధర్మరాజు జూదంలో రాజ్యాన్ని, సంపదను, తమ్ములను, తనను తాను పందెంగా పెట్టి ఓడిపోయాక ద్రౌపదిని ఫణంగా పెడతాడు. అప్పుడు ద్రౌపది ‘నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా’ అ ని కీలకప్రశ్నను సభకు సంధిస్తుంది. తనను తాను ఓడిపోయిన ధర్మరాజునకు నన్ను పణంగా పెట్టే హక్కు ఎలా ఉంటుందనేది ఆమె ప్రశ్న. నిజానికి, దీనిని కుటుంబ వివాదం లేదా ఆస్తి వివాదంగా కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కు, గౌరవాలకు సంబంధించిన ధర్మబద్ధమైన ప్రశ్నగా చూడాలి. ఆమె ప్రశ్నలో వ్యక్తి స్వేచ్ఛ, హక్కు, అధికారం వంటి అంశాలను సభ పరిశీలించాలనే అభ్యర్థన ఉన్నది. ఇది దాదాపుగా చాణక్యుడు చెప్పిన ‘వ్యవహారం చెల్లుతుందా, లేదా’ అనే న్యాయ సంబంధిత ప్రశ్నకు దగ్గరగా కనిపిస్తుంది.

అలాగే ఉద్యోగపర్వంలో విదురుడు ధృతరాష్ర్టునితో.. రాజా! కోపంలో నిర్ణయం తీసుకోకూడదు. అలాగే లోభంతో తీర్పు చెప్పకూడదు. మోహానికి లోనైతే రాజ్యం నశిస్తుంది.. అంటాడు. న్యాయాధిపతి కోపంతో తీర్పుచెపితే అధర్మం రాజ్యం చేస్తుంది. పక్షపాత వైఖరితో తీర్పుచెపితే అన్యాయం పలకరిస్తుంది, అంటాడు భీష్ముడు శాంతిపర్వంలో. ధృతరాష్ర్టుని పుత్రవ్యామోహం వంశాన్ని నాశనం చేసింది. వ్యక్తి వివేకపూరిత నిర్ణయాలే న్యాయానికి ప్రమాణమనే చాణక్యుని భావనకు దాదాపుగా ప్రతీకలుగా మహాభారత సన్నివేశాలు కనిపిస్తున్నాయి.

ఈనాటి భారతీయ న్యాయవ్యవస్థలోనూ మానసిక సామర్థ్యం లేని స్థితిలో, మద్యం మత్తులో, బలవంతంగా లేదా బెదిరింపుల వల్ల జరిగిన ఒప్పందాలు, ఆస్తి బదిలీలు, లావాదేవీలను న్యాయస్థానాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సైబర్ మోసాలు, వృద్ధులపై బలవంతపు ఆస్తి బదిలీలు, మానసిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల లావాదేవీల వంటి సమకాలీన సందర్భాలు ప్రాసంగికంగానైనా చాణక్యుని బోధనలలో కనిపిస్తున్నాయి. అందువల్ల పాలకులైనా, ప్రతిపక్ష నాయకులైనా కోపావేశంలో కాకుండా వివేకంతో వ్యవహరించాలి. రాజకీయ నిర్ణయాలు, నిరసనలు కూడా చట్టబద్ధమైన మార్గాలలోనే సాగాలని చాణక్యుని బోధల నుంచి గ్రహించవచ్చు. 

ఒకప్పుడు న్యాయంగా, ధర్మబద్ధంగా పరిపాలించే రాజు వద్దకు, ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన వ్యాజ్యం వచ్చింది. ఒక మిత్రుడన్నాడు, మహారాజా! నా మిత్రుడు నిన్న రాత్రి తన పొలాన్ని నాకు అమ్ముతున్నట్లు ఒక పత్రంపై సంతకం చేశాడు. ఇప్పుడా ఒప్పందాన్ని అతడు అంగీకరించడం లేదు. న్యాయం చేయండన్నాడు. ప్రతివాది రాజుతో.. మహారాజా! ఆ సమయంలో నేను మద్యం మత్తులో ఉన్నాను. నాకు సరైన ఆలోచనా స్థితి లేదు. నా పొలాన్ని అమ్మాలనే ఉద్దేశమూ నాకు లేదు.

కాబట్టి ఒప్పందాన్ని రద్దు చేయించండి అన్నాడు. రాజు తొందరపడలేదు. న్యాయాధికారులను పిలిచి విచారణ జరిపించాడు. న్యాయాధికారులు సాక్షులను విచారించి, ప్రతివాది మత్తులో ఉండి తన నిర్ణయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడని నివేదికను ఇచ్చారు. అప్పుడు రాజు తీర్పు చెపుతూ... మనిషి వివేకంతో, స్వేచ్ఛగా తీసుకున్న నిర్ణయానికే న్యాయబలం ఉంటుంది. మత్తు లేదా బలహీనస్థితిని ఉపయోగించుకొని పొందిన లాభం ధర్మ సమ్మతం కాదు. కాబట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసి, మోసపూరితంగా వ్యవహరించిన వాదిని శిక్షించాడు.

చాణక్యుడు వ్యక్తి స్వేచ్ఛా సంకల్పం, వివేకపూర్వక నిర్ణయానికి న్యాయపరమైన ప్రాధాన్యం ఇచ్చాడు. న్యాయం అనేది కేవలం పత్రాలను పరిశీలించడం కాదు. ఆ పత్రం వెనుక ఉన్న వ్యక్తి మానసికస్థితి, పరిస్థితులు, ఉద్దేశాన్ని కూడా గమనించాలి. అదే ధర్మబద్ధమైన, వివేకవంతమైన, న్యాయబద్ధమైన తీర్పుగా భాసిస్తుంది. అప్పుడే ప్రజలలో న్యాయవ్యవస్థపై గౌరవం పెరుగుతుంది.

పాలకుర్తి రామమూర్తి