ఢిల్లీ X గుజరాత్
ఢిల్లీ: గత మ్యాచ్‌లో సొంతగడ్డపై హైదరాబాద్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మరిచిపోయేందుకు ఢిల్లీ సమాయత్తమవుతోంది. బుధవారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్‌తో ఢిల్లీ తలపడనుంది. తాజా సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో పరాజయం పాలైన గుజరాత్.. ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. లీగ్‌లో గుజరాత్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండగా.. ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో 8వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్ అవకాశాలు మెరుగ్గా ఉండాలంటే ఇరు జట్లకు విజయం తప్పనిసరి కాగా.. బ్యాటింగ్‌లో గుజరాత్‌తో పోలిస్తే ఢిల్లీ కాస్త పైచేయిలో ఉంది.
కెప్టెన్ రిషబ్ పంత్ జట్టు తరపున టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. మార్ష్ స్థానంలో వచ్చిన జేమ్స్ మెక్ గుర్క్ రెండు హాఫ్ సెంచరీలతో మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ కుదురుకోవాల్సి ఉంది. ఇక బౌలింగ్‌లో పేసర్ ఖలీల్ అహ్మద్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లు ఆకట్టుకుంటుండగా.. ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ ప్రభావం చూపుతున్నారు. మరోవైపు గుజరాత్ బ్యాటింగ్‌లో పెద్దగా మెరుపుల్లేవ్.
పంజాబ్‌తో మ్యాచ్‌లో 143 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఏడు వికెట్లు కోల్పోవడం ఆ జట్టు బ్యాటింగ్ ఎంత బలహీనంగా ఉందో తెలుపుతోంది. ఓపెనర్ సాహా పూర్తిగా విఫలమవుతుండగా.. కెప్టెన్ గిల్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. సాయి సుదర్శన్ రాణించాల్సిన అవసరముండగా.. మిల్లర్ విఫల మవుతుండడంతో విలియమ్సన్ జట్టులోకి వచ్చే అవకాశముంది. తెవాటియా ఆడుతున్నప్పటికి అతడికి సరైన సహకారం లేదు. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.






